అట్టహాసంగా ముగిసిన వజ్రోత్సవాలు.. వాళ్ల కాళ్లు మొక్కిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి మల్లారెడ్డి ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర్య సమరయోధులు విశ్వనాథ్(92), జానాభాయ్(108)లను సత్కరించి వారికి మంత్రి మల్లారెడ్డి పాదాభివందనం చేశారు. అంతేగాక, ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు వజ్రోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో వైభవంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ కృషి చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని, వారిని అభివృద్ధిపథంలో పయనింపచేసేందుకు గిరిజనబంధు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించడం సీఎంకు వారి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శమని మంత్రి స్పష్టం చేశారు. వజ్రోత్సవాలను విజయవంతం చేయడంలో జిల్లా కలెక్టర్ హరీశ్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది కృషి ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీఈవో విజయకుమారి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మేకల కావ్య, జెడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. ఆయన నటన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అహుతులను అలరించాయి. ఏకపాత్రాభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డిని మంత్రి మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు అభినందించారు.