'భార్యతో గొడవ పెట్టుకుందని'.. విద్యార్థినిపై చేయి చేసుకున్న ఎస్ఐ..

Update: 2023-05-10 16:53 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: `రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తాను´ ప్రతీ పోలీస్ విధుల్లో చేరే ముందే చేసే ప్రతిజ్ఞలోని ఓ అంశమిది. కానీ జగిత్యాల ఎస్సై అనిల్ కుమార్ సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఏ కారణం లేకుండా ఓ ఎంబీఏ విద్యార్థినిపై చెయ్యి చేసుకున్నారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బస్సులో నుంచి కిందకు దింపి చెంప దెబ్బలు కొట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా జగిత్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చెయ్యక పోవటం గమనార్హం. జగిత్యాల టౌన్ జాంబాగ్ ప్రాంత నివాసి షేక్ ఫర్హా (22) ఎంబీఏ విద్యార్థిని. మంగళవారం బెజ్జంకికి తన తల్లితో కలిసి వెళ్లిన ఫర్హా మధ్యాహ్నం 1.30 కు ఆర్టీసీ బస్సులో జగిత్యాలకు బయలుదేరింది. అదే బస్సులో జగిత్యాలకు వస్తున్న ఓ మహిళ ఫర్హా ఆమె తల్లి కూర్చున్న సీటు వద్దకు వెళ్లి ఖాళీగా ఉన్న మూడో సీటులో కూర్చుంది. ఆ తర్వాత స్థలం సరిపోవటం లేదని ఫర్హా ఆమె తల్లిని కిటికీ వైపు జరగమని పదే పదే అనటంతో గొడవ జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ వెనక సీట్లో కూర్చుంది.

కొద్దిసేపు తర్వాత ఫర్హా దగ్గరకు వచ్చి నా భర్త ఎస్సై ఫోన్ చేస్తా.. జగిత్యాల బస్టాండ్ చేరుకున్నాక మీ సంగతి చెప్తా అంటూ బెదిరించింది. జగిత్యాల డిపో వద్దకు బస్సు చేరుకుంటుండగానే ఎస్సై అనిల్ కుమార్ సివిల్ డ్రెస్ లో కారుతో అడ్డగించారు. ఆయనతోపాటు యూనిఫామ్ లో ఉన్న ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. బస్సులోకి ఎక్కిన ఎస్సై ఎవరు నీతో గొడవ పెట్టుకున్నది అని తన భార్యను ప్రశ్నించాడు. ఆమె ఫర్హాను చూపించగా దగ్గరికి వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించాడు. దాంతో భయపడ్డ ఫర్హా తన ఫ్రెండ్ నెంబర్ కి వీడియో కాల్ చేసి జరుగుతున్న దాన్ని రికార్డు చేసింది. అది గమనించిన ఎస్సై ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోయి ఫర్హాపై చెయ్యి చేసుకున్నాడు. ఫోన్ లాక్కొని కింద కొట్టి పగులగొట్టాడు.

ఆ తర్వాత ఫర్హా జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బస్సు నుంచి కిందకు లాక్కొచ్చాడు. బూటు కాళ్లతో తన్నాడు అతని భార్య ఫర్హా తల్లిపై చెయ్యి చేసుకుంది. ఇది చూసి ఓ మహిళ నిలదీయటంతో ఫర్హా ఫోన్, బస్సు టిక్కెట్లు, పర్సు లాక్కొని వెళ్ళిపోయాడు. దీనిపై ఫర్హా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నా పోలీసులు మాత్రం ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చెయ్యలేదు. పైగా ఫిర్యాదు వాపస్ తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఫర్హా ఆరోపించింది. తనను, తన తల్లిని కొట్టిన ఎస్సై, వెంట ఉన్న కానిస్టేబుల్ పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నించింది.

Tags:    

Similar News