ఆనాడు మీరెక్కడున్నారు? రఘునందన్ రావుపై జగ్గారెడ్డి విమర్శలు
మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హైదరాబాద్‌కు వచ్చాక వారిని కలిసి నగరానికి ఐటీఐఆర్‌ను తీసుకురావాలని లేఖను అందజేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు కేటాయించిన ఐటీఐఆర్‌ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. ఈ కారణంగా తెలంగాణ యువకులకు 15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయన్నారు. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందున ప్రాజెక్టును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను కోరుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
చదువు లేకున్నా.. జీవితాన్ని చదివా...
తనకు ఐటీఐఆర్ గురించి ఏమీ తెలియదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ తనకు మీ అంత చదువు లేకపోయినా జీవితాన్ని చదివానని సెటైర్ వేశారు. జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్ఎస్లో అని, ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచేనని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఆయన తీరు ఉందన్న రఘునందన్ విమర్శలపై స్పందిస్తూ తాను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లిన నాడు రఘునందన్‌రావు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాను బీజేపీ నుంచి గెలవడం కాదని బీజేపీకి ఎలాంటి సపోర్ట్ లేని సమయంలో తాము ఆ పార్టీ కోసం పని చేశామని స్పష్టం చేశారు.