టీ-బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక మహిళా నేత..?
తెలంగాణ రాజకీయాల్లో పూట పూటకు కొత్త ట్విస్ట్‌లు నమోదు అవుతున్నాయి. కేసీఆర్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఇన్నాళ్లు ప్రకటనలు చేసిన బీజేపీ పార్టీకి వరుసగా షాకులు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పూట పూటకు కొత్త ట్విస్ట్‌లు నమోదు అవుతున్నాయి. కేసీఆర్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఇన్నాళ్లు ప్రకటనలు చేసిన బీజేపీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోగా అదే బాటలో మరో సీనియర్ నేత విజయశాంతి పయనించబోతున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అసంతృప్తుతో ఉన్న రాములమ్మ కాషాయ శిబిరంతో కొంత కాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె రేపు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ ఆమె బీజేపీకి రాజీనామా సమర్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండియాలో తమకు ఎంట్రీ పాస్ అవుతుందనుకున్న తెలంగాణలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటం బీజేపీ అధిష్టానానికి తల నొప్పి వ్యవహారం కాగా హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ బలోపేతం కావడం సవాలుగా మారుతోందన్న చర్చ జరుగుతున్నది.
ఏఐసీసీ నేతలతో చర్చలు పూర్తి!:
బీజేపీలో కొనసాగే విషయంలో గత కొంత కాలంగా విజయశాంతి డైలామాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ఆమె హాజరు కాలేదు. మరోవైపు అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసేందుకు నేను సిద్ధమే అని గతంలో ప్రకటించారు. అయినా బీజేపీ ఇప్పటి వరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రాములమ్మ పేరు లేదు.
దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మరింత నొచ్చుకున్న విజయశాంతి కండువా మార్చేందుకు రెడీ అయిందని, ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న విజయశాంతి.. హస్తినా కేంద్రంగా ఏఐసీసీ అగ్రనేతలతో రాములమ్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇవాళ బీజేపీకి గుడ్ బై చెప్పేసి రేపు హస్తం గూటికి చేరుతారని తెలుస్తోంది.
రాములమ్మ పోటీపై ఉత్కంఠ:
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరుగాంచిన విజయశాంతి కాంగ్రెస్‌లో చేరితో పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2020 బీజేపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేసే స్థానంపై రకరకాల ప్రచారం జరుగుతున్నది.
మెదక్, మల్కాజ్ గిరి, గజ్వేల్,కామారెడ్డి, సికింద్రాబాద్ స్థానాల్లో ఆమె పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇందులో మెదక్, మల్కాజ్ గిరి, గజ్వేల్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇదివరకు అభ్యర్థులను ప్రకటించింది. కామారెడ్డి ఒక్క స్థానమే పెండింగ్‌లో ఉంది. దీంతో ఆమె హస్తం పార్టీలో చేరినా పోటీ చేస్తారా లేక ప్రచారం వరకే పరిమితం అవుతారా అనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఉద్యమకారురాలైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్, బీజేపీలకు బిగ్ షాక్ కానున్నది.