ఇవాళే బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 60 పేర్లు ఫిక్స్ చేసిన హైకమాండ్..?
బీజేపీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్టు ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం విడుదల కానున్నది. ఇందులో సుమారు 60 నుంచి 70 మంది పేర్లు ఉండొచ్చని అంచనా. మహిళలకు, బీసీ
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్టు ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం విడుదల కానున్నది. ఇందులో సుమారు 60 నుంచి 70 మంది పేర్లు ఉండొచ్చని అంచనా. మహిళలకు, బీసీ నేతలకు ఫస్టు లిస్టులోనే ప్రయారిటీ ఎక్కువ ఉంటుందని బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలో బలమైన నేతలు, విజయావకాశాలు ఉండే అభ్యర్థులు, పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలపై రాష్ట్ర నేతలు కేంద్ర పార్టీకి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ ఇంట్లో జరిగిన చర్చల అనంతరం జాబితా కొలిక్కి వచ్చింది. ప్రధాని మోడీ హాజరైన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రాత్రి పొద్దుపోయే వరకూ సుదీర్ఘంగా చర్చించి దాదాపు 70 మంది పేర్లను ఖరారు చేసింది.
రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తదితరులంతా ప్రకాశ్ జవదేకర్ నివాసంలో జరిగిన చర్చల్లో ఒక్కో నియోజకవర్గం, అభ్యర్థి విజయావకాశాలపై లోతుగా చర్చించారు. ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనలతను బేరీజు వేసుకుని అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.
తెలంగాణలో పార్టీకి ఇటీవల పెరిగిన మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇతర పార్టీలపై బీసీ నేతలకు ఉన్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత ఎక్కువ మంది బీసీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించి, ఆ సెక్షన్ ఓటు బ్యాంకును ఆకర్షించేలా కసరత్తు జరిగింది. మహిళలకు సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వనందున తొలి లిస్టులో వారికి కూడా సముచిత ప్రాధాన్యత కల్పించిన ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నది.
వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితాను ఆలస్యం చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు. కానీ నామినేషన్లకు సమయం దగ్గర పడుతున్నందున దసరా పండుగ లోపు ఫైనల్ చేయడం సమంజసంగా ఉంటుందని కేంద్ర నాయకులు భావించారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌కు తెలంగాణకు చెందిన కోర్ కమిటీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నేతలు కూడా హాజరయ్యారు.
ఒక్కో రాష్ట్రం జాబితాను ఖరారు చేయడానికి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దాదాపు ఆరు గంటలకు పైగా కసరత్తు చేసింది. తెలంగాణ ఫస్ట్ లిస్టులో సీనియర్ నేతల పేర్లు ఉండొచ్చని టాక్. పండగ అయిపోగానే వారివారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసుకునేందుకు వీలుగా తొలి జాబితాను పార్టీ ప్రకటించింది.