ఐటీ దాడులు కొత్తే కాదు.. తప్పు చేయకుంటే భయమెందుకు?
రాష్ట్రంలో ఐటీ దాడులు కొత్తవేం కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని గురువారం ఆయన కలిశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ దాడులు కొత్తవేం కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని గురువారం ఆయన కలిశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు జడుసుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాక్సులు సక్రమంగా కట్టకుంటే ఎవరికౌనా సరే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. అధికారులు వారి పని వారు చేసుకుంటున్నారని, దీనికి రాజకీయానికి ముడిపెట్టి టీఆర్ఎస్ నేతలు ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కక్షకొద్ది కావాలనే బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇరికిస్తున్నారని ఫైరయ్యారు. దేశసేవ చేసే వ్యక్తిపై లేనిపోని అభాండాలు వేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లను పెట్టుకుని కావాలని కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. తాము రాజకీయంగా, న్యాయ పరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం 26 కులాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించడంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ గవర్నర్ తమిళి సైని కలిశారు. వారిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని, ఇందుకు కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న వారిని తెలంగాణ ఏర్పడ్డాక 26 కులాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఏకపక్షంగా తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో 3 కారణంగా 26 కులాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కూడా రావట్లేదన్నారు. తల్లిదండ్రులు ఫీజు కట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశంపై ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చేస్తాం.. చూస్తాం అని హామీలివ్వడం తప్పితే బీసీలుగా గుర్తించట్లేరని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారంతా ఆంధ్రప్రదేశ్ మూలాలకు చెందిన వారు కావడంతోనే కేసీఆర్ బీసీ జాబితా నుంచి తొలగించారని, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు అవలంభించకుండా, వారి స్థితి గతులపై అధ్యయనం చేయకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరించి తొలగించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని బీసీ జాబితాలోకి చేర్చకపోయినా.. త్వరలోనే తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు వారిని బీసీ జాబితాలోకి చేర్చుతామని హామీఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన మరుక్షణమే కేసీఆర్ 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం తిరిగి బీసీలుగా గుర్తిస్తామని హామీలు గుప్పిచి విస్మరించారని ఫైరయ్యారు. తల్లిదండ్రులు బీసీలుగా ఉంటే పిల్లలకు మాత్రం ఆ స్టేటస్ లేకుండా పోయిందన్నారు. ఏపీ మూలాలు ఉండటం వల్లనే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో స్థిరపడిన 26 కులాల వారు ఇక్కడ పుట్టడమే తాము చేసుకున్న పాపమా అని భావిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 26 కులాలను బీసీ జాబితాలోకి తీసుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.