బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీల రాజీనామా వెనుక అసలు రీజన్ ఇదేనా?
సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకు వస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకు వస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎంపీ ఎన్నికల్లోపై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు జోష్ మీద ఉండగా బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు వరుసగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటం కారు పార్టీలో కంగారుపెట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అండగా నిలుస్తారనుకున్న నేతలే ఇలా చేజారిపోవడం వెనుక కొత్త కోణం చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ లో నెలకొన్న ఆధిపత్య పోరే పార్టీ నుంచి వలసలకు కారణం అవుతోందనే చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అసంతృప్త నేతలను ఆపేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.
పొగపెడుతున్న సొంత పార్టీ నేతలు:
అధికారంలో ఉండగా అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్న నేతలు అధికారం కోల్పోయాక ఒక్కొక్కరుగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, నాగర్న కర్నూల్ ఎంపీ రాములు, తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కారు దిగి ప్రత్యామ్నాయం చూసుకున్నారు. అయితే వీరు పార్టీ మారడం వెనుక బీఆర్ఎస్ లో నేతల మధ్య కోల్డ్ వారే కారణం అనే చర్చ జరుగుతోంది. ఎంపీ వెంకటేశ్ నేతకు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఇచ్చిన రిపోర్ట్ కారణంగా అధిష్టానం ఆయనను దూరం పెట్టిందనే ప్రచారం జరిగింది. ఇక పార్టీ కార్యక్రమాలకు, అధికారిక కార్యక్రమాలకు తనకు ముందస్తు అహ్వానం లేకుండా అవమానిస్తున్నారని దీంతో పార్టీలో ఉండడం కన్నా వెళ్లిపోవడమే బెటర్ అనే నిర్ణయంతోనే మరో ఎంపీ రాములు కారు దిగిపోయారనే టాక్ వినిపించింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు తాజా మాజీ ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ పీక్స్ కు చేరిందని, అధికారంలో ఉండగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తన అనుచరులను ఉద్దేశపూర్వకంగానే దూరం పెట్టారని దీంతో ఆయన కొంత కాలంగా ఎమ్మెల్యేలతో కాకుండా నేరుగా స్థాని ప్రజాప్రతినిధులతో టచ్ లో ఉంటున్నారనే ప్రచారం నియోజకవర్గంలో గుప్పుమంటోంది. పార్టీలో ఉన్నవారే తమకు పొగ పెడుతున్నందున ఈ ఆధిపత్యపోరు భరించడం కంటే పార్టీ మారిపోవడమే బెటర్ అనే నిర్ణయంతో ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
నెక్స్ట్ ఎవరు?:
ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే మిగతా నాయకుల విషయంలోనూ ఆధిపత్యపోరే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు కార్పొరేటర్లు, కేటీఆర్ ముఖ్య అనుచరులు పార్టీ వీడేందుకు అక్కడి నేతలతో ఉన్న వర్గపోరే కారణం అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పార్టీని వీడిన వారి పరిస్థితి ఇలా ఉంటే ఎంపీ టికెట్ల విషయంలోనూ బీఆర్ఎస్ లో కోల్డ్ వార్ రంజుగా సాగుతోందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నల్గొండలో గుత్తా సుఖేందర్ వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందనే చర్చ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఈసారి ఎలాగైనా తన కుమారుడిగి ఎంపీ టికెట్ ఇప్పించేందుకు గుత్తా ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలకు జగదీశ్ రెడ్డి తన అనుచరులతో అడ్డుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని ఒక నేతకు మరో నేత అడ్డుపుల్లలు వేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యనేతలు కారు దిగివెళ్తుంటే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే నెక్స్ట్ లీడర్ ఎవరూ అనేది సొంత పార్టీలో సస్పెన్స్ గా మారింది.
కేసీఆర్ నో రియాక్ట్:
ఎంపీ ఎన్నికల వేళ ఓ వైపు పార్టీలో ఆధిపత్యపోరు జూలు విదుల్చుతుంటే మరో వైపు ఆపరేషన్ బీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీలు తెరలేపాయి. ముఖ్య నేతలను తమ వైపు ఆకర్షిస్తూ బీఆర్ఎస్ కు దెబ్బమీద దెబ్బ కొడుతున్నాయి. అసెంబ్లీ ఫలితాల తర్వాత నిరాశలో ఉన్న క్యాడర్ కు తాజా పరిణామాలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంటే అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరును చెక్ పెట్టి అసంతృప్త నేతలను బుజ్జగించాల్సిన అధినేత ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అధినేత తీరు మాత్రం మారడం లేదని కేసీఆర్ వైఖరిపై సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.