జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? హరీశ్ రావు ఆసక్తికర పోస్ట్
జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ లో 118 జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. రాజకీయ కక్షలో భాగంగా బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగిల్చడం శోచనీయం అని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమని ఆరోపించారు. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేయవద్దని, ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ సీఎంఓకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.