‘ఆట’ సభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వితీయ వార్షిక మహాసభలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌కి సోమవారం ఆహ్వానం అందింది.

Update: 2024-04-15 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వితీయ వార్షిక మహాసభలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌కి సోమవారం ఆహ్వానం అందింది. జూన్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు అట్లాంటలోని ‘జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్’‌లో నిర్వహించే ఆట కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా ఆట ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఆట కన్వినర్ పాశం కిరణ్‌రెడ్డి ఆహ్వాన లేఖను మంత్రికి అందించారు.

ఈ వేడుకల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువత కోసం జాబ్ ఫెయిర్స్, ఎడ్యూకేషన్ సమ్మిట్స్, హెల్త్ క్యాంప్స్‌తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు, సానిటేషన్ వంటి మౌలిక వసతులు కల్పించేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన మంత్రికి వివరించారు. విశాలమైన అమెరికా దేశంలో ఆట వేదికగా తెలుగు భాష మాట్లాడేవారందరిని ఒక్కటిగా కలిపి ఉంచడంతోపాటు తెలుగు భాషను, సంస్కృతిని పెంపొందిస్తున్నామని ఆయన మంత్రికి లేఖలో వివరించారు. కుటుంబ సమేతంగా ఆట సమావేశాలకు హాజరుకావడం వల్ల తెలుగువారందరికీ మంచి సందేశం ఇస్తుందని ఆట ప్రతినిధులు మంత్రికి సూచించారు.

Tags:    

Similar News