ప్రీతి ఘటనపై దర్యాప్తు జరిపించండి.. సీఎస్, డీజీపీలకు గవర్నర్ ఆదేశం
వరంగల్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదేశించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై గురువారం అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోగానే రాజ్‌భవన్‌కు కూడా వెళ్ళకుండా నేరుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతిని పరామర్శించారు. ఆమెకు అందుతున్న ట్రీట్‌మెంట్ గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు చేరుకున్న వెంటనే సీఎస్. డీజీపీలకు వేర్వేరు లేఖలు రాసి ఈ ఘటనకు దారితీసిన కారణాలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు.
ప్రీతిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దానికి తగినట్లుగానే ఇద్దరికీ వేర్వేరుగా లేఖలు రాయడం గమనార్హం. ఆస్పత్రికి వెళ్ళేటప్పుడు ఆమె వాహనంలో పూలదండ ఉండడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ రాతపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు. పుదుచ్చేరి, చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా రాజ్‌భవన్‌కు వెళ్ళడానికి ముందే ఖైరతాబాద్‌లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఆ ఉద్దేశంతోనే కారులో పూలదండ ఉన్నది తప్ప మరో కారణమేదీ లేదని రాతపూర్వకంగా మీడియాకు ఇచ్చిన వివరణలో స్పష్టత ఇచ్చారు. ఆ లేఖలోనే సీఎస్, డీజీపీకి దర్యాప్తు విషయమై ఆదేశాలు ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రెస్ సెక్రటరీ పేర్కొన్నారు.