నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్స్.. వినూత్న ప్రయోగానికి సిద్ధమైన బోర్డు అధికారులు

ప్రాక్టికల్స్ అనేవి సాధారణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నిర్వహిస్తుంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఈ మార్కులు వారికి కీలకంగా మారుతాయి.

Update: 2024-02-01 02:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాక్టికల్స్ అనేవి సాధారణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నిర్వహిస్తుంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఈ మార్కులు వారికి కీలకంగా మారుతాయి. కానీ ఇంటర్ బోర్డు అధికారులు వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనికి శ్రీకారం చుట్టారు. బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయం ఒకందుకు మంచిదే అయినప్పటికీ ఫస్టియర్ విద్యార్థులు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఫస్టియర్ లోనే ప్రాక్టికల్స్ నిర్వహించడం, దానికి తోడు తొలిసారి ఇంగ్లిష్ కు ప్రాక్టికల్స్ ఉండటంతో ఎలాంటి అంశాలపై ఉంటుందనేది వారి భయానికి కారణమవుతున్నది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఈ గుబులు మరింత ఎక్కువగానే ఉన్నది. అయితే ఈ భయాన్ని పోగొట్టేందుకే తాము ఈ ప్రాక్టికల్స్ కు శ్రీకారం చుట్టామని బోర్డు అధికారులు చెబుతున్నారు.

విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకే..

ఇంటర్ బోర్డు నిర్ణయాలు ఇప్పటికే పలు సందర్భాల్లో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. బీఆర్ఎస్ హయాంలో జవాబు పత్రాల మూల్యంకనంలో వచ్చిన తేడాలతో ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో బోర్డుపై మచ్చ పడింది. అయితే ప్రాక్టికల్స్ నిర్వహణ వల్ల విద్యార్థులకు మేలు జరిగినా.. తొలిసారి ప్రాక్టికల్స్ ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భయాందోళనగా ఉన్నారు. ఇంగ్లిష్ అంటే భయం పోగొట్టేందుకే ఈ ప్రాక్టికల్స్ అని అధికారులు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులకు ఇంగ్లిష్ రాయడం, చదవడంలో ఇబ్బందులను గుర్తించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాక్టికల్స్ లో విద్యార్థులు తమకు నచ్చిన ఏదైనా ఒక అంశంపై మాట్లాడటం, ఏదైనా ఒక ప్యాసేజ్ ని రాయడం వంటివి మాత్రమే ఉంటాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

నేటి నుంచి ప్రాక్టిల్స్ షురూ

ఇంటర్ ప్రాక్లికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 16వ వరకు జరగనున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. మొత్తం 2032 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. కాగా ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించనున్నారు. మూడు విడుతల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 5వరకు, 6 నుంచి 10 వరకు రెండో విడుత, 11 నుంచి 15వ తేదీ వరకు మూడో విడుత ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. కాగా ఇందులో మొదటి విడుతలో 3,34,214 మంది జనరల్, 1,41,280 మంది వొకేషనల్ విద్యార్థులు హజరుకానున్నారు. కాగా, రెండో విడుతలో 2,36,157 మంది జనరల్, 1,50,742 మంది వొకేషనల్, మూడో విడుతలో 2,09,363 మంది జనరల్, 97,461 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు.

జేఈఈ రాసేవారికి మరో బ్యాచ్ తో ప్రాక్టికల్స్..

నేటితో జేఈఈ పరీక్ష పూర్తికానుంది. ప్రాక్టికల్ కూడా గురువారం నుంచే ప్రారంభం కావడంతో జేఈఈ పరీక్ష రాసే విద్యార్థులకు ముందుగానే ఆయా జిల్లాలవారీగా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు చెప్పాలని సూచించినట్లు అధికారులు చెప్పారు. అలాగే ఈ ప్రాక్టికల్స్ జరిగే సమయంలోనే ఎన్‌సీసీ పరీక్ష కూడా ఉండటంతో ఈ పరీక్షకు హాజరయ్యే వారి వివరాలు కూడా చెప్పాలని సూచించామని పేర్కొన్నారు. డీఐఈఓల అనుమతితో వారికి బ్యాచ్ మార్చి మరొక రోజు ప్రాక్టికల్ నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఆధారాలు కూడా డీఐఈవోలకు అందించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా గతంలో మాల్ ప్రాక్టీస్ కు కొందరు లెక్చరర్లు సహకరించారని, ఇలాంటి ఘటనలపై ఆధారాలతో నిజమే అని నిర్ధారించుకున్నాక వారిని సస్పెండ్ చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News