రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

ఇంటర్ పరీక్షలు ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి.

Update: 2023-03-13 15:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ పరీక్షలు ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఫస్టియర్ పరీక్షలు 15వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా 16 నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కాగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 1473 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోకుండా చర్యలు తీసుకుంటన్నారు. ఈ మేరకు డీఐఈవోలకు బోర్డు అధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటుచేసుకోవాలని అధికారులు స్పష్టంచేశారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒత్తిడి కారణంగా పలువురు బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు టెలీ మానస్ ద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. విద్యార్థుల్లో ఒత్తిడి, భయాందోలనలను తొలగించాలని చూశారు. తెలంగాణ వ్యాప్తంగా 14 కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతోనూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చేలా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ వరకు సాగనున్నాయి. సెకండియర్ పరీక్షలు 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వకుండా వైద్య సిబ్బంది సైతం అక్కడే ఉండాలని సూచించింది. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా పరీక్షల సమయంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

విద్యార్థుల్లో ఒత్తిడి, భయాందోళనలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి మనోధైర్యాన్ని నింపాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాస్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హాల్​టికెట్లను డౌన్​లోడ్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News