ప్రాణహిత నుంచే ఎంక్వయిరీ! కాళేశ్వరంపై విచారణకు ‘ఎక్స్‌పర్ట్స్ కమిటీ’

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ లోతుగా అధ్యయనం చేయాలనుకుంటున్నది.

Update: 2024-05-20 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ లోతుగా అధ్యయనం చేయాలనుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నుంచే తన ఎంక్వయిరీని మొదలు పెట్టాలని భావిస్తున్నది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపులు మొదలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి ఒప్పందం కుదుర్చుకున్నంత వరకు మొత్తం వ్యవహారాన్ని నిశితంగా స్టడీ చేయాలనుకుంటున్నట్లు ఇరిగేషన్ డిపార్టుమెంటు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రాణహితను పక్కన పెట్టడానికి కారణాలు? కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయాల్సిన అవసరం? మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం? దాని ప్రకారమే నిర్మాణం జరిగిందా? ఏవైనా డీవియేషన్స్ వచ్చాయా? ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు తెరమీదకు వచ్చాయి.

నిపుణులతో కమిటీ!

మరోవైపు సాంకేతిక అంశాలతో కూడిన ఎంక్వయిరీ కావడంతో నిపుణులతో కూడిన కమిటీని కూడా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను, రాష్ట్ర ఇరిగేషన్ డిపార్టుమెంటుకు చెందిన అధికారులు, ఇంజినీర్లు వెల్లడించే అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టతకు రావాలనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ రెండు దఫాలుగా ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లతో చర్చలు జరిపింది. మూడు బ్యారేజీలు దెబ్బతిన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు తదితర వివరాలు, డాక్యుమెంట్లన్నింటినీ అధికారుల నుంచి సేకరించింది. విచారణ ప్రక్రియలో భాగంగా ఆ శాఖ సెక్రటరీ మొదలు ఇంజినీర్ల వరకు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి అనేక కోణాల నుంచి డీటెయిల్స్ సేకరించింది.

లోతుగా అధ్యయనం

పలు అంశాలపై జ్యుడీషియల్ కమిషన్ లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసుకునేలా చేసిన డిజైన్? మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందంలో పెట్టుకున్న నిబంధనల ఉల్లంఘన? వంటి వాటిపై స్టడీ చేయనున్నది. డిజైన్ మార్పులో ఎవరెవరి ప్రమేయం ఉన్నది? ప్రాణహిత ప్రాజెక్టుతో పోలిస్తే కాళేశ్వరం ద్వారా అదనంగా ఒనగూరే ప్రయోజనాలేంటి? రాష్ట్ర డిజైన్ ఆర్గనైజేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపొందించిన డిజైన్ ఎలా ఉన్నది? మార్పులు జరిగినట్లయితే ఎవరి ప్రమేయంతో జరిగాయి? నిర్మాణ సంస్థకు అందిన డిజైన్ ప్రకారమే నిర్మాణమైందా? ఇలాంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నది. టెక్నికల్ అంశాల విషయంలో నిపుణుల కమిటీ నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నది. మేడిగడ్డకు తక్షణం చేయాల్సిన రిపేర్ పనులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసులను కమిషన్ స్టడీ చేసిన తర్వాత ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఆఫీసర్లు, ఇంజినీర్లకు నోటీసులు

కాళేశ్వరం నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పలువురు ఆఫీసర్లు, ఇంజినీర్లకు ఎంక్వయిరీకి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. మూడు బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతోనూ తొలి దఫా రివ్యూ నిర్వహించింది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో విధుల్లో ఉండి ఇప్పుడు రిటైర్ అయిన అధికారులనూ నోటీసులు ఇచ్చి కమిషన్ రప్పించనున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వైట్ పేపర్‌ను రిలీజ్ చేసింది. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో, ప్రజాధనం దుర్వినియోగమైందో, మూడు బ్యారేజీలు దెబ్బతినడానికి దారి తీసిన కారణాలు, 2019లోనే లోపం బయటకు వచ్చినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు... ఇలాంటి అనేక అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వైట్ పేపర్‌లో వివరించారు. వీటినీ జ్యుడీషియల్ కమిషన్ పరిగణలోకి తీసుకుని ఎంక్వయిరీ సమయంలో అధికారులు, ఇంజినీర్ల వివరణలకు అనుగుణంగా వ్యవహరించనున్నది.

నిశిత పరిశీలన..

అనేక అంశాలను జ్యుడీషియల్ కమిషన్ నిశితంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. ప్రాణహిత డిజైన్‌ను ఆమోదించిన ఉమ్మడి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన అంచనా వ్యయమెంత? కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన తర్వాత పెరిగిందెంత? అదనంగా ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి రానున్నది? ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టడానికి గత ప్రభుత్వం లేవనెత్తిన కారణాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాలుగేండ్ల కాలంలో అందిన ఫలాలు? ఏ మేరకు కొత్త ఆయకట్టు సాకారమైంది? ఇలాంటి అనేక అంశాలను లోతుగా విశ్లేషించనున్నదని ఆ అధికారి గుర్తుచేశారు. ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాక అంచనా వ్యయానికి మించి ప్రభుత్వం చేసిన సవరణలు? దానికి అనుగుణంగా పరిపాలనాపరమైన అనుమతుల మంజూరు, నిధుల విడుదల ఉత్తర్వులు, దానికి చూపిన కారణాలు, కాంట్రాక్టు సంస్థలతో ఏమైనా లోపాయికారి ఒప్పందమున్నదా? ఇలాంటి అంశాలనూ కమిషన్ పరిశీలించనున్నదని సమాచారం.

ప్రాణహితను పక్కనపెట్టడం మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంతవరకు గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటిపైనా కమిషన్ అధ్యయనం చేయడంతో పాటు టెక్నికల్ అంశాలపై నిపుణుల కమిటీని నియమించుకుని నివేదిక తెప్పించుకోవడం ద్వారా ఎంక్వయిరీ జరుగతుందని ఆ అధికారి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కమిషన్ నిర్ధారణకు వస్తే దాన్ని రికవరీ చేయడానికి ఎలాంటి సిఫారసులను ప్రభుత్వానికి ఇస్తుందనేది కీలకంగా మారింది.


Similar News