అమాయకులే టార్గెట్‌గా ఆన్‌లైన్ మోసాలు.. పెరుగుతున్న సైబర్ క్రైమ్స్
రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.
రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు అనుగుణంగా ఆన్ లైన్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. జేబులో క్యాష్ లేకున్నా ప్యాకెట్‌లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటర్నెట్ వినియోగం దగ్గర నుంచి పేమెంట్స్ వరకు అన్ని ఆన్ లైన్‌లోనే జరుగుతున్నాయి. జాబ్ వేకెన్సీ కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు. క్యాష్ కోసం బ్యాంకుకు వెళ్లే పనిలేదు. ఇలా ఒకటి రెండు కాదు చాటింగ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు ఇలా ప్రతీ పని ఆన్ లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. టెక్నాలజీపై అవగాహన లేకపోతే అంతే సంగతి.
తెలిసి తెలియక అమయాకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో తమకు తెలియకుండానే పెద్దమొత్తంలో జేబులు గుల్లవుతున్నాయి. ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో ఇద్దరు బాధితులు ఆన్ లైన్ మోసగాళ్ల ఉచ్చులో పడి డబ్బు పోగొట్టుకున్న పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. సైబర్ క్రైమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక మూల ఆన్‌లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
దిశ, జగిత్యాల ప్రతినిధి : రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంటే దానికి అనుగుణంగా ఆన్ లైన్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. జేబులో క్యాష్ లేకున్నా ప్యాకెట్‌లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటర్నెట్ వినియోగం దగ్గర నుంచి పేమెంట్స్ వరకు అన్ని ఆన్ లైన్‌లోనే జరుగుతున్నాయి. జాబ్ వేకెన్సీ కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు. క్యాష్ కోసం బ్యాంకుకు వెళ్లే పనిలేదు. ఇలా ఒకటి రెండు కాదు చాటింగ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు ఇలా ప్రతీ పని ఆన్ లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు.
టెక్నాలజీతో కేవలం ఉపయోగాలు మాత్రమే కాదు అవగాహన లేకుండా వాడడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఆన్ లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో ఇద్దరు బాధితులు ఆన్ లైన్ మోసగాళ్ల ఉచ్చులో పడి డబ్బు పోగొట్టుకున్నారు.
ఫేస్‌బుక్ ప్రకటనతో మోసం...
జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామానికి చెందిన అనుమల్ల శివప్రసాద్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలో తన బయోడేటాను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. యువకుడి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు బాధితుడు వాట్సాప్ నంబర్‌కు ఉద్యోగం ఇస్తానని మెసేజ్ చేసి నమ్మించారు. ఉద్యోగం వస్తుందని అయితే కొంత అమౌంట్ డిపాజిట్ రూపంలో చెల్లించాలని అడగడంతో శివప్రసాద్ పలు దఫాలుగా రూ.1,72,000 పంపించాడు. డబ్బు పంపిన తర్వాత ఉద్యోగం ఇప్పించకపోగా ఎన్నిసార్లు ఫోన్ చేసిన దుండగులు స్పందించక పోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
బ్యాంకు నుంచి చేస్తున్నామని...
మరో ఘటనలో ధర్మపురి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. బాధితుడి రెండు క్రెడిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని, వాటిని తిరిగి ఆక్టివేట్ చేయాలంటే ఓటీపీ చెప్పాలని కోరారు. కాల్ చేసిన వ్యక్తి హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడగా మొదట అనుమానం కలిగినప్పటికీ ఫోన్ చేసిన వ్యక్తి నమ్మించడంతో నిజమే కావచ్చు అనుకున్న బాధితుడు ఓటీపీ చెప్పాడు. దీంతో క్షణాల వ్యవధిలో అకౌంట్ నుంచి రూ.1.90లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు బ్యాంక్‌ను ఆశ్రయించగా ఫ్రాడ్ జరిగిందని తెలుసుకున్న సదరు వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఓ ప్రైవేట్ టీచర్..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పరిచయం కాస్త స్నేహంగా మారడంతో ఫోన్‌లో మాట్లాడిన సదరు అమ్మాయి విదేశాల నుంచి ఖరీదైన గిఫ్టులు, ఫోన్లు పంపిస్తున్నట్లుగా ప్రైవేట్ టీచర్‌కు తెలిపింది. అయితే ఆ గిఫ్టులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి రిలీజ్ అవ్వాలంటే కస్టమ్స్ టాక్స్ కట్టాలని నమ్మబలికి బాధితుడు నుంచి రూ.లక్షకు పైగా టోకరా వేసింది. డబ్బు పంపిన తర్వాత సదరు యువతీ రెస్పాండ్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ప్రైవేటు టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భయంతో కంప్లైంట్ ఇవ్వలేదు.
జాగ్రత్తలు అవసరం..!
- గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారు ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగిన ఇవ్వకూడదు.
- ఏ బ్యాంకు కూడా కస్టమర్లకు ఫోన్ చేసి ఎటువంటి ఓటీపీలు, పాస్వర్డులు అడగరు.
- గుర్తింపు పొందిన అధికారిక వెబ్ సైట్ల నుంచి మాత్రమే లావాదేవీలు జరపాలి.
- తెలియని లింకులపై క్లిక్ చేయకూడదు.
- వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయకూడదు.
- ఉద్యోగాలకు సంబంధించి గుర్తింపు పొందిన సంస్థలు డబ్బు డిమాండ్ చేయవనే విషయం గుర్తుంచుకోవాలి.
ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం.
ప్రజలు ఆన్ లైన్ మోసాల భారిన పడకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ తరఫున విరివిగా అవగాహన కల్పిస్తున్నాం. యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పరిచయం లేని వ్యక్తులకు పంపించకూడదు. అనవసరమైన లింక్‌ల పైన క్లిక్ చేయకూడదు. ఓటీపీ లేదా పాస్ వర్డ్ వంటివి ఎవరికీ షేర్ చేయకూడదు. తక్కువ బడ్జెట్‌లో విలువైన వస్తువులు ఆఫర్ చేసే వారి పట్ల జాగ్రత్త వహించాలి. పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేస్తే ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే 1930 నంబర్‌లో లేదా 100కి ఫోన్ చేయాలి.
- రవీందర్, జగిత్యాల ఇంచార్జి డీఎస్పీ