Sridhar Babu: తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ.. సభలో శ్రీధర్ బాబు

బడ్జెట్ లో తెలంగాణకు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.

Update: 2024-07-24 07:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది ముమ్మాటికి తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షే అని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలను కోరినా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిందని, తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వం తమకు మిత్రపక్షాలుగా ఉన్న ఏపీ, బీహార్ కే ఎక్కువ నిధులు ఇచ్చిందని, కేంద్రం అనుసరిస్తున్న ఈ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని విమర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటల బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పేరును ప్రస్తావించలేదని ఫైర్ అయ్యారు. విభజన చట్టంలో 35 హామీలున్నాయి. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లోనూ అన్యాయమే జరిగింది. ఫైనాన్స్ కమిషన్ సూచనలను కేంద్రం లైట్ తీసుకుంది. పూర్వోదయ స్కీమ్ లోనూ కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాంటి నిర్ణయాలతో వికసిత్ భారత్ సాధ్యం కాదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న అన్యాయంపై రాష్ట్రంలోని పార్టీలకు అతీతంగా సభ్యులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

విభజన చట్టం పెట్టుకుని మాకు అన్యాయమా?:

విభజన చట్టాన్ని అడ్డం పెట్టుకుని కేవలం ఏపీకి న్యాయం చేసి తెలంగాణకు అన్యాయం చేయడం సమంజసం కాదని శ్రీధర్ బాబు విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు పట్టించకోవడం లేదని ప్రశ్నించారు. మన రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద గ్రోత్ ఇంజిన్. తెలంగాణ ప్రమేయం లేకుండా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. తెలంగాణలో హైదరాబాద్ లోనే ఎయిర్ పోర్టు ఉంది. ఏదైనా పరిస్థితుల వల్ల తాత్కాలికంగా క్లోజ్ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయిలోని టూరిజం డెస్టినేషన్ ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోలేదన్నారు.

Tags:    

Similar News