కేసీఆర్‌కు రైతు ఉత్సవం జరిపే అర్హతెక్కడిది?

తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో రైతు ఉత్సవం పేరుతో వేడుకలు చేయడంపై ఆత్మగౌరవ వేదిక చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ మండిపడ్డారు. రైతులకు ఏం ఉద్ధరించినందుకు ఈ సంబురాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ప్రశ్నించారు.

Update: 2023-06-03 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో రైతు ఉత్సవం పేరుతో వేడుకలు చేయడంపై ఆత్మగౌరవ వేదిక చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ మండిపడ్డారు. రైతులకు ఏం ఉద్ధరించినందుకు ఈ సంబురాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ప్రశ్నించారు. నాలుగు విడతల్లో రుణమాఫీ అమలుచేస్తామని 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయలేదని ఎండగట్టారు. రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలను వృధా చేస్తున్న ఆయన ప్రజల అవసరాలాను తీర్చడానికి ఖర్చు పెట్టి ఉంటే ప్రయోజనం కలిగేదన్నారు. ఊరూరా సంబురాల పేరుతో రైతుల్ని, ప్రజలను మభ్యపెట్టడాన్ని తప్పుపట్టారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా సాగదీశారని, రెండోసారి పవర్‌లోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళు దాటినా ఇంకా పది శాతం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. సుమారు 30 లక్షల మందికి పైగా రైతులకు రూ. 21,557 కోట్లను రుణమాఫీ హామీ కోసం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ రెండు విడతల్లో కేవలం రూ. 1,207 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇంకా 31 లక్షల మంది రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రుణమాఫీ కోసం రూ. 26, 303 కోట్లను బడ్జెట్‌లో లెక్కలు చూపించినా చివరకు 5% మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రైతులను ఆశల్లో ముంచి మోసం చేసిన కేసీఆర్‌కు దశాబ్ది ఉత్సవాల్లో రైతు ఉత్సవం జరిపే అర్హతెక్కడిదని ప్రశ్నించారు.

అకాల వర్షాలకు వడ్లు తడిచిపోయి రైతులు ఆగమవుతూ ఉన్నారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అన్యాయం జరుగుతూ ఉంటే ప్రైవేటు మిల్లర్లు, బయ్యర్లకు అమ్ముకోవాల్సి వస్తున్నదని, చివరకు వారి దోపిడీకి మోసపోతున్నారని, ఇవేవీ ప్రభుత్వానికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కల్లాలను తోరణాలతో ఎట్లా అలంకరించాలి, రైతన్న పండగ ఎట్లా చేసుకోవాలి అని ఆలోచించడం దుర్మార్గమన్నారు. ఆత్మస్థైర్యం ఇచ్చి అండగా నిలబడకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల సొమ్ముతో ఆర్భాటం చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఫసల్ బీమా యోజన స్కీమ్‌ను ఆపివేసి రైతులకు పంట నష్టపోతే పరిహారం అందుకోడానికి ప్రత్యామ్నాయం చూపించలేకపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుల బారిన పడిన 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, గతంలో వారికి జీవో 194 ప్రకారం ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందేదని, రైతుబీమా స్కీమ్‌ తెచ్చిన తర్వాత ఆ జీవోను అటకెక్కించి వీరికి అన్యాయం చేసిందని ప్రభుత్వాన్ని నిందించారు. కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉంటే ఇన్ని వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News