రాష్ట్ర చిహ్నం మార్పు వివాదం.. చివరి నిమిషంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. కాగా, చిహ్నం, రాష్ట్ర గీతం విషయంలో గతకొన్ని రోజులుగా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, లోగోలో చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాద్‌ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా రూపొందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.