'ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. సిద్ధంగా ఉండండి'.. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించటంతోపాటు ఎలక్షన్లు సాఫీగా జరిగేలా చూడటానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది.

Update: 2023-05-22 16:35 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించటంతోపాటు ఎలక్షన్లు సాఫీగా జరిగేలా చూడటానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. ఈ క్రమంలో డీజీపీ అంజనీ కుమార్ ​సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల యూనిట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ అన్నది ప్రతీ అధికారికి ప్రతీసారీ కొత్తగానే ఉంటుందని చెబుతూ సరికొత్త సవాళ్లు కూడా ఎదురవుతుంటాయని ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్​ చెప్పారు. మరో అయిదారు నెలల్లో రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి పరిపాలనా పరమైన ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల సంబంధిత పాత నేరాలు తదితర అంశాలపై ఆయన కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీ లకు ఆయన అవగాహన కల్పించారు.

ఎన్నికలకు మరో అయిదారు నెలల గడువు ఉన్నా జూన్, జూలై నెలల నుంచే అమలు చేయాల్సిన ప్రణాళిక, ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, క్షేత్రస్థాయిలో ఎంతమంది సిబ్బందిని విధుల్లో పెట్టాలి, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అంశాలపై పూర్తి స్పష్టత కలిగి ఉండాలని చెప్పారు. ప్రస్తుతం యూనిట్​అధికారుల్లో చాలామంది కొత్తగా నియమితులైన అధికారులు ఉన్న నేపథ్యంలో గతంలో ఎన్నికల బందోబస్తు విధుల్లో అనుభవం ఉన్న ప్రతీ స్థాయి అధికారి సహకారం తీసుకోవాలని సూచించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల కమిషన్​ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిశీలకులుగా వెళ్లిన అదనపు డీజీ సౌమ్యా మిశ్రా, డీసీపీ అభిషేక్​ మొహంతి లు అక్కడి తమ అనుభవాలను వివరించారు.

సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్​కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరంగా చేపట్టాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, విధుల నిర్వర్తనలో ఎదురయ్యే సవాళ్లు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్​ రోజున చేయాల్సిన ప్రత్యేక బందోబస్తు తదితర అంశాలపై అదనపు డీజీ సౌమ్యా మిశ్రా పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఇంటెలిజెన్స్​విభాగం అదనపు డీజీ అనిల్​కుమార్​మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మూడేళ్ల సర్వీస్​ పూర్తి చేసుకున్న ప్రతీ పోలీసు అధికారిని బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. దీనికోసం ఇప్పటి నుంచే తగు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్​కుమార్​జైన్​మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్​కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన చెక్​పోస్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

సీఐడీ అదనపు డీజీ మహేశ్​ భగవత్​ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్​స్టేషన్​లో ఒక గైడ్​పోలీస్​ను ఎంపిక చేయాలన్నారు. ఈ గైడ్​ పోలీసు అధికారి భద్రతా విధులు నిర్వర్తించటానికి వచ్చే కేంద్ర బలగాలకు ఉపయోగకరంగా ఉంటాడన్నారు. తెలంగాణ పోలీస్​ బెటాలియన్స్​ అదనపు డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఎన్నికల బందోబస్తు కోసం వచ్చే కేంద్ర పారా మిలటరీ దళాల మోహరింపు తదితర అంశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్​రూం ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు డీజీపీ విజయ్​ కుమార్​ మాట్లాడుతూ.. ప్రస్తుతం శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల సేవలను కూడా ఎన్నికల సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఐజీ షానవాజ్ ​ఖాసీం మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో అమలు చేసిన గుడ్​ ప్రాక్టీస్​ను ఈసారి కూడా అమలు చేయాలన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే నిర్వహణ సులభతరంగా ఉంటుందని చెప్పారు. ఇంటెలిజెన్స్ ​డీఐజీ కార్తికేయ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో సున్నిత, సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాల గుర్తింపులో స్పష్టతతో ఉండాలన్నారు.

Tags:    

Similar News