ముగ్గురు మూడు రోజులు.. మునుగోడుకు అగ్రనేతల ఫినిషింగ్ టచ్‌లు

దాదాపు నెల రోజులుగా మునుగోడు ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకున్నది. ఇప్పటికే పలు దఫాలుగా ఇంటింటికీ తిరిగి పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు.

Update: 2022-10-23 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దాదాపు నెల రోజులుగా మునుగోడు ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకున్నది. ఇప్పటికే పలు దఫాలుగా ఇంటింటికీ తిరిగి పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు. సీనియర్ నేతలు అక్కడే మకాం వేశారు. వచ్చే నెల 3న పోలింగ్ జరగనుండగా 1వ తేదీ సాయంత్రానికే ప్రచారం పరిసమాప్తం కానున్నది. చివరి మూడు రోజుల్లో మూడు పార్టీల అగ్ర నేతలు మునుగోడును సందర్శించనున్నారు. వేర్వేరు చోట్ల భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 30న చండూరులో, ఆ మరుసటిరోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడులో, నవంబరు 1న నియోజకవర్గంలో పర్యటించనున్న రేవంత్ అక్కడ బహిరంగసభకు బదులుగా ర్యాలీ లేదా రోడ్‌షోలో ప్రసంగించనున్నారు. నెల రోజులుగా పైగా జరిగిన ఉప ఎన్నిక ప్రచారానికి వీరు ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు.

ఇప్పటివరకూ మద్యం, మాంసం, స్వీట్లు, గిఫ్టులు, విరాళాలు, ఆలయాల సందర్శన లాంటివి బహిరంగంగానే జరిగాయి. ఒకదాన్ని మరో పార్టీ విమర్శించుకున్నాయి. రోడ్ షో, ర్యాలీల టైమ్‌లో పరస్పరం బాహాబాహీకి దిగాయి. ఒక పార్టీ బండారాన్ని మరొకటి బైటపెట్టుకున్నాయి. పోటీపోటీగా ప్రచారానికి రోజుకూలీగా తలా రూ. 500 చొప్పున కిరాయి జనాన్ని సమకూర్చుకున్నాయి. కానీ చివరి మూడు రోజుల్లో మూడు పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే అగ్రనేతల స్పీచ్ 'కీ రోల్' పోషించనున్నది. మూడు పార్టీలకూ ఇక్కడి గెలుపు కీలకంగా మారింది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరాదని భావిస్తున్నాయి. మూడు పార్టీల అగ్రనేతలు ఇచ్చే ఫినిషింగ్ టచ్‌పైనే ఇప్పుటు ఆయా పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నాయి.

వివిధ జిల్లాల నుంచి తరలివెళ్ళిన నేతలంతా వచ్చే నెల 1న ప్రచారం ముగుస్తున్నందున స్వస్థలాలకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆ తర్వాత రహస్య ప్రచార బాధ్యతంతా స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, శ్రేణులదే. ఈసారి ఓటు ధర రూ. 30 వేలు దాటుతుందనే మాటలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రెండు మూడు ఓట్లు ఉన్న కుటుంబానికి లక్ష అన్ని పార్టీలది కలిపి రూపాయలకుపైగానే చేతికందుతాయనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ప్రచారం ముగిసిపోయిన తర్వాత కరెన్సీ నోట్ల పంపిణీ షురూ కానున్నది. రాత్రి పది గంటల తర్వాత ప్రచారం నిషేధం కావడంతో పలు పార్టీల సీనియర్ నేతలు రహస్యంగా ఇళ్ళకు వెళ్ళి ఓటర్లను కలుస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారం ముమ్మరంగానే జరుగుతున్నది. 

ఇవి కూడా చదవండి : ఓట్లు లక్ష ఓటరుకు రూ.లక్ష..? అసలు టార్గెట్ అదే..​


Similar News