బల్దియాలో పైరవీల జోరు.. ఏళ్లు గడుస్తున్నా బదిలీల్లేవ్!
గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో మెజార్టీ సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లదే హవా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో మెజార్టీ సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లదే హవా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి, ఏళ్లు గడుస్తున్నా, డిప్యూటేషన్ గడువు ముగిసినా, వీరు సీట్లను వదలడం లేదనే తెలిసింది. ఎప్పటికప్పుడు వీరు మంత్రుల వద్ద పైరవీలు చేసుకుంటుండటంతో వీరిని ప్రశ్నించేందుకు కమిషనర్ సైతం సాహసించడం లేదనే విమర్శలున్నాయి.
ఇందుకు నిదర్శనమే ఖైరతాబాద్ సర్కిల్‌లో చోటుచేసుకున్న పరిణామం. ఓ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌ను ఖైరతాబాద్ నుంచి రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినా, ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సదరు ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లను ఇక్కడి నుంచి రిలీవ్ చేయకుండా వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పలువురు యూనియన్ నాయకులు జోక్యం చేసుకుని కమిషనర్ ఆదేశాలిచ్చిన తర్వాత ఎందుకు రిలీవ్ చేయటం లేదని ప్రశ్నించగా, ఉద్యోగుల వ్యవహారాల్లో యూనియన్ నేతలు జోక్యం చేసుకోవద్దంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కానీ యూనియన్లు, యూనియన్ నేతలున్నదే ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసమని, వారి ప్రయోజనాలను పరరక్షించేందుకేనని తేల్చి చెప్పటంతో సదరు డిప్యూటీ కమిషనర్ మౌనం వహించినట్లు తెలిసింది. ఈ రకంగా గ్రేటర్‌లోని మెజార్టీ సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల అక్రమాలు, అవినీతికి అంతులేకుండా పోయింది. వీరిని కనీసం ప్రశ్నించే వారే లేకపోవటంతో వీరు రెచ్చిపోతున్నారు.
లావాదేవీ ఏదైనా..లంచం కావల్సిందే
సర్కిల్ స్థాయిలో పర్మినెంట్, ఔట్‌సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి లావాదేవీ జరిగినా వీరికి లంచాలు చెల్లించాల్సిందే. కనీసం మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని జీతం క్లెయిమ్ చేయాలన్నా, రావల్సిన జీతంలో సగం డిప్యూటీకి చెల్లించాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమార్కులు దాదాపు అన్ని జోన్లలో ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు.
అడిగినంత లంచం ఇవ్వకపోయినా, ఎందుకివ్వాలని ఎదురు ప్రశ్నించినా, సర్వీసు రికార్డులు గల్లంతైపోతున్నట్లు కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వీపింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే ఎస్ఎఫ్ఏ మొదలుకుని మెడికల్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఇంజనీర్లు, ట్యాక్స్‌కు సంబంధించి బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లంతా నెలసరి మమూళ్లు చెల్లించుకోవల్సిందే.
లేదంటే వారిని పక్కనబెట్టడమో, వారు పని చేసే స్థానాన్ని మార్చటమో వంటి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొంత కాలం క్రితం లంచాల పంపిణీలో డీసీలకు, ఏసీపీలకు, మెడికల్ ఆఫీసర్ల మధ్య గొడవలు జరగటంతో జోనల్ కమిషనర్లు జోక్యం చేసుకుని పంచాయతీలు పెట్టి, శాంతింపజేశారంటే వీరు అక్రమార్జన ఏస్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.
చిరుద్యోగులే టార్గెట్
జీహెచ్ఎంసీలో పర్మినెంట్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. పేద, మధ్య తరగతికి చెందిన బహుజనులే. వీరిని టార్గెట్ చేసుకుని డిప్యూటీ కమిషనర్లు కులం పేరిట అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్న ఘటనలు లేకపోలేవు. శేరిలింగంపల్లి వెటర్నరీ విభాగంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ కార్మికుడితో వెటర్నరీ ఆఫీసర్ బాత్ రూమ్‌లు శుభ్రం చేయించిన ఘటన గతంలో దుమారం రేపినా, ఆ తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యల్లేవ్.
ఈ ఘటనలో బాధ్యుడైన వెటర్నరీ అధికారి శంషాబాద్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన విల్లా నిర్మాణ పనుల్లో కూడా కార్మికులను వేధింపులకు గురి చేసి పని చేయించినట్లు కూడా ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు ముషీరాబాద్‌లో మహిళా కార్మికులపై డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అసభ్యకరంగా మాట్లాడినా చర్యల్లేవ్. చివరకు స్వీపర్లను ట్రాప్ చేసి, రకరకాలుగా వేధిస్తున్న డిప్యూటీలు నేటికీ సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్‌పల్లితో పాటు దాదాపు అన్ని జోన్లలో ఉన్నా, వారిపై ఫిర్యాదులు చేసినా చర్యల్లేకపోవటానికి కుల వివక్షే ప్రధాన కారణమని బాధితులు వాపోతున్నారు.