గవర్నర్‌తో మెరుగుపడ్డ సంబంధాలు.. ఇకపైన తమిళి సై ప్రవర్తన ఎలా ఉండనుంది?

ఇంతకాలం ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య గ్యాప్ కొనసాగింది. దానికి భిన్నంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రిలేషన్స్ మెరుగుపడ్డాయి.

Update: 2023-02-03 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య గ్యాప్ కొనసాగింది. దానికి భిన్నంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రిలేషన్స్ మెరుగుపడ్డాయి. ఇది ఇప్పటివరకేనా.. లేక ఇకపైన కూడా కంటిన్యూ అవుతుందా అనే ఆసక్తికర చర్చ ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకున్నది. ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. రెండేండ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఆమెకు ప్రభుత్వం తరఫున సకల గౌరవ మర్యాదలు లభించాయి. ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్, సహకారం ఇకపైన ఎలా ఉంటాయన్నది పరిస్థితులను బట్టి ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. తమ వైపు నుంచి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇచ్చామని, ఇకపైన కూడా ఇదే కంటిన్యూ అవుతుందని, అయితే ఆమెవైపు నుంచి ఎలా ఉంటాయన్నది కాలమే తేలుస్తుందన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి వచ్చిన ఆమెకు ముఖ్యమంత్రి సహా అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలే ప్రసంగంలో ఉండడంతో స్పీడ్‌గా చదివేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమో లేక విమర్శించడమో లేకపోవడంతో ఆమె స్పందన బహిర్గతం కాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు అవకాశం ఇవ్వాల్సి రావడంతో ఎక్కడా కొరత రాకుండా చూసుకున్న ప్రభుత్వం ఇప్పటికైతే ఆమెను నొప్పి,చకుండా చూసుకున్నది. దీంతో ఆమె సంతృప్తి చెందారా, భవిష్యత్తులో పరస్పర సహకారానికి ఈ సెషన్ దోహదపడుతుందా అనేదానిపై మాత్రం అధికార పార్టీ నేతల్లో క్లారిటీ లేదు.

గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ముగించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు ద్వారా ఆంక్షలు ఎదురయ్యాయి. మరో గత్యంతరం లేక గవర్నర్‌ను ప్రసంగించడానికి ఆహ్వానించాల్సి వచ్చింది. గవర్నర్‌తో ప్రభుత్వానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో, పరిపాలనలో ఆమెకున్న ప్రాధాన్యత ఏంటో తెలియని అంశమేమీ కాకపోయినా ఇంతకాలం ఉప్పు-నిప్పు లాంటి సంబంధాలే కొనసాగాయి. ఈ కారణంగా అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ నుంచి అప్రూవల్ లభించలేదు. ఆ బిల్లులు చట్టరూపం దాల్చకపోవడంతో ప్రభుత్వం అనుకున్న పనులు పెండింగ్‌లో పడ్డాయి. గవర్నర్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించి ఉన్నట్లయితే ఈ చిక్కులు ఉండేవి కావన్న చర్చల అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య వినిపించాయి.

ఇప్పుడు దారికి వచ్చిన రిలేషన్స్‌ను ఇకపైన కూడా ప్రభుత్వం కంటిన్యూ చేయాలనుకోవాలనే అభిప్రాయం అధికార పార్టీ నేతల్లో వ్యక్తమైంది. అందులో భాగంగానే రాజ్యాంగపరంగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను కల్పించామని గుర్తుచేశారు. అసెంబ్లీకి రావడానికి ముందు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్‌కు వెళ్ళారని, అక్కడ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, డీసీపీలు స్వాగతం పలికారని గుర్తుచేశారు. ప్రభుత్వం వైపు నుంచి అన్నీ పాజిటివ్‌గానే ఉంటాయని, ఇకపై మార్పు రావాల్సిందిగా రాజ్‌భవన్ వైపు నుంచే అని రూలింగ్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

ఆమె ఇకపైన ఎలా వ్యవహరిస్తారనేదానిపై తమ ఆశలు, ఆకాంక్షలు ఆధారపడి ఉంటాయన్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలన్నది తేలుతుందన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో రిస్కు తెచ్చుకోవద్దనే కోణం నుంచి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నది. గవర్నర్‌తో ఘర్షణను నివారించుకోవాలనుకుంటున్నది. ఇకపైన ఎలాంటి రిలేషన్స్ ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి : రాజీనా? ముందు జాగ్రత్తా..? గవర్నర్ స్పీచ్ ప్రగతికే పరిమితం

Tags:    

Similar News