అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డా.. ఏకంగా 120 నాన్ లేఅవుట్ ప్లాట్లకు..
మున్సిపల్ చట్టం తెచ్చినా సెల్ఫ్ అసెస్మెంట్ యాక్ట్ బోధన్‌లో అక్రమార్కులకు వరంగా మారింది.
మున్సిపల్ చట్టం తెచ్చినా సెల్ఫ్ అసెస్మెంట్ యాక్ట్ బోధన్‌లో అక్రమార్కులకు వరంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో లేని ఇండ్లను ఉన్నట్లు సెల్ఫ్ అసెస్మెంట్ కింద ఇంటిపన్నులను కట్టి ఇంటి నెంబర్‌లను పొంది వాటి ద్వారా రిజిస్ర్టేషన్‌లు జరిపించారు. ఏకంగా నాన్ లే అవుట్ ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేసినట్లు అంతా కోడై కూస్తోంది. గడిచిన రెండు నెలలుగా నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ర్టేషన్లు జోరుగా జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు రిజిస్ర్టేషన్ కార్యాలయాలలో ఈ దందా గతంలో జరిగిన విషయం తెలిసిందే. జిల్లా లో సబ్ రిజిస్ర్టార్‌లు, డాక్యుమెంట్ రైటర్లు, దళారులు కుమ్మక్కై ఏకంగా మార్కెట్ ఫీజు తగ్గించి రిజిస్ర్టేషన్ జరిపారు. దానిపై ఇప్పటికీ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. జిల్లా రిజిస్ర్టార్ కానీ.. ఉన్నతాధికారులు కానీ స్పందించకపోవడంతో ఇప్పుడు నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ర్టేషన్ లు జిల్లా అంతటా పాకాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారిందా అంటే అవుననే పలు వురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదా యానికి భారీగా గండిపడే విధంగా కొందరు అక్రమార్కులు కొద్ది రోజుల కింద బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పి వారి పనులను సులువుగా, మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరిపించుకున్నట్లుగా ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్ అధికారులు లే అవుట్ లేని ప్లాట్లను ఎవరు కొనుగోలు చేయరాదని బోర్డింగులు పెట్టి మరి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ కొందరు వ్యక్తులు లే అవుట్ లేని ఫ్లాట్లను కొందరు వ్యక్తులకు అంటగట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో సన్నిహితంగా మెదిలే వారి చేతులు తడిపి ఇదే అవకాశంగా వారి పనులను చక్కబెట్టుకున్నారని విమర్శలు వస్తు న్నాయి. దస్తావేజు లేఖరులు సైతం అక్రమ రిజిస్ట్రేషన్లకు తమవంతు పూర్తి సహకారం అందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌కు దాదాపు 11 నుంచి 45 వేల వరకు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. మొత్తం మీద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లక్షల్లో ముడుపులు తీసుకుని పనులు పూర్తి కానిచ్చినట్లు విమర్శలు లేకపోలేదు. గత రెండు నెలల కాలంలో 120వరకు ఈ రిజిస్ర్టే షన్ లు జరిగినట్లు సమాచారం.
బోధన్ పట్టణంలోని రాకాసీ పేట్, నర్సాపూర్ రోడ్డు, పాండు పారం తర్పా ప్రాంతాలలోని లే అవుట్ లేకుండా కొందరు వ్యక్తులు వందల సంఖ్యలో ప్లాట్లను విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించి కోట్ల రూపాయలు దండుకున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ర్టేషన్ కోసం సబ్ రిజిస్ర్టార్‌పై తీవ్రంగా ఓత్తిడి తెచ్చినట్లు తెలిసింది. రిజిస్ర్టేషన్‌ల తరువాత సెలవులో వెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికి చాలా మంది సెల్ప్ అసెస్మెంట్ కింద ఇంటి నెంబర్ల అధారంగా రిజిస్ర్టేషన్ శాఖకు చాలన్‌లు కట్టినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెస్తుండటంతో అక్కడ రిజిస్ర్టార్‌గా చేయడానికి అందరు భయపడుతున్నారన్నారు.
ఇంత బహిరంగంగా అవినీతి జరుగు తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఏంటని సంబంధిత డివిజన్, జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌ల ఆరోపణలు వాస్తవమా లేక అవాస్తవమా అని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్ల కుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.