అక్రమంగా తవ్వకాలు.. 133మంది చిట్టా రెడీ చేసిన పోలీసు శాఖ

నిజామాబాద్ జిల్లాలో గత పది సంవత్సరాల కాలంలో గుట్టలను కుళ్లబొడిచారు.

Update: 2024-04-13 02:08 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గత పది సంవత్సరాల కాలంలో గుట్టలను కుళ్లబొడిచారు. వాగులు, వంకల్లో ఇసుకను ఎడా పెడా తవ్వకాలు చేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని పార్టీల లీడర్లు మొదలుకొని క్యాడర్ వరకు మొరం, గ్రానైట్ ను తవ్వి తరలించారు. పోలీస్ శాఖ ద్వారా అనుమతులు తీసుకుని బండరాళ్లను పెల్చాల్సి ఉండగా అలాంటివి ఏమీ లేకుండా గుట్టలను గుల్ల చేశారు. అధికార పార్టీ పేరు చెప్పి జరిపిన తవ్వకాలు అన్ని ఇన్ని కావు. నిజామాబాద్ జిల్లా కేంద్రం మొదలుకొని అటు కమ్మర్ పల్లి, ఇటు బాల్కొండ, అటు బోధన్, ఇటు వర్ని మండలాల్లో తవ్వకాలు చేశారు.

వారికి మైనింగ్ శాఖ అండదండలు ఉండటంతో గుట్టలు మైదానాలు మారాయి. మొరం తవ్వకాలపై రెవెన్యూ శాఖ ఫిర్యాదు చేసినా మైనింగ్ శాఖ, పోలీస్ శాఖలు ప్రేక్షక పాత్ర పోషించాయి. డెవలప్ మెంట్ పనులు అని గ్రామ అవసరాలకు అని పేరు చెప్పి వందల టిప్పర్లలో, ట్రాక్టర్‌లలో మొరం తరలించారు. ఎలాంటి వే బిల్లులు లేకపోయిన డెవలప్ మెంట్ ప్రోగ్రాంల పేరిట టిప్పర్ల కు స్టిక్కర్లను అతికించి మొరం గుట్టలను పిండి చేశారు. నిజామాబాద్ జిల్లాలో తవ్వకాలు కొన్ని ప్రాంతాలలో క్వారీలు వేల క్యూబిక్ మీటర్ల నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల మొరం తరలించారు.

నిజామాబాద్ జిల్లాలో మైనింగ్ ఉల్లంఘనుల చిట్టా తయారైంది. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు జిల్లాలో మొరం తవ్వకాలు చేసిన వారిపై పోలీసు శాఖ కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో మైనింగ్ చేస్తున్న వారి చిట్టా తయారు చేశారు. అందులో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులందరి పేర్లు ఉన్నాయి. వారితో పాటు మొరం వ్యాపారులు, జేసీబీల యజమానులు, టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానుల పేర్లను పెట్టారు. ప్రధానంగా నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు చంద్రశేఖర్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భావమరిది, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ చార్జి వినయ్ రెడ్డి బావమరిది, వర్ని పూర్వ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కల్ల ముస్తేదార్లు రాజేశ్వర్ గౌడ్‌తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి.

నిజామాబాద్ అర్బన్ , రూరల్ మండలం, మోపాల్ మండలంతో పాటు నందిపేట్, మాక్లూర్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, ఆర్మూర్, నందిపేట్, బాల్కొండ, మెండోరా, మోర్తాడ్, భీంగల్, ఏర్గట్ల, కమ్మర్ పల్లి, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, రుద్రూర్, వర్ని, కోటగిరి మండలాల్లో మొరం తవ్వకాలు చేసిన వారి వివరాలతో కూడిన జాబితాను తయారు చేశారు. ఇటీవల ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మైనింగ్ మాఫియాపై ఫిర్యాదులు చేసిన విషయం తెల్సిందే. దానిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇంచార్జి మంత్రి హామీ ఇవ్వగా జిల్లాను మైనింగ్ చేసిన వారి చిట్టాను పోలీసు శాఖ తయారు చేసింది.

నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోని రెండు పూర్వపు మండలాల్లో మైనింగ్ మాఫియాపై పోలీసు శాఖ చిట్టాను తయారు చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఈ నెల రెండవ వారంలో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ భర్త దండు శేఖర్‌ను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు. తర్వాత ఎవరి వంతు అని చర్చ జరుగుతుంది. జిల్లాలోని అన్నీ మండలాల్లో గుట్టలను పిండి చేసిన ఘనుల వెనుక మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల హస్తం ఉందనేది అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం 133 మంది ఉల్లంఘనుల జాబితాను తయారు చేసిన పోలీసు శాఖ అందులో అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులు, బంధువులు ఉండడంతో వారిపై చర్యలు తీసుకుంటారా అన్న సంశయం వ్యక్తమౌతుంది. ఇటీవల కొందరికీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. పండుగల నేపథ్యంలో మైనింగ్ మాఫియాపై చర్యలకు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కల్మేశ్వర్ సింగనవార్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాడు అధికార పార్టీ చెబితే పట్టించుకోని కమిషనర్ ఇప్పుడు మైనింగ్ మాఫియాపై కొరడా ఝళిపించడం ఖాయమని చెబుతున్నారు.


Similar News