గ్రామకంఠం భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం.. సెక్రటరీ సంతకం ఫోర్జరీ..!
గ్రామపంచాయతీ సమక్షంలో అందరూ కలిసి గ్రామ కంఠానికి సంబంధించిన స్థలంలో హరితహారం మొక్కలు నాటాలని తీర్మానించారు.
గ్రామపంచాయతీ సమక్షంలో అందరూ కలిసి గ్రామ కంఠానికి సంబంధించిన స్థలంలో హరితహారం మొక్కలు నాటాలని తీర్మానించారు. ఆ స్థలం పూర్తిగా జీపీ కోసం మాత్రమే ఉపయోగించి ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు చేయరాదని అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ ఖాళీ స్థలంలో స్థానిక నాయకుల అండదండలతో ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. స్థలాన్ని తమ పేరు చేసుకోవడానికి ఏకంగా అప్పటి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. కంది మండలం బేగంపేట గ్రామ పంచాయతీలో అక్రమ, అవినీతి ఫోర్జరీ బాగోతం ఇప్పుడు బయటపడింది. తమను ఎవరూ అడిగేవారు లేరంటూ ఏకంగా ఇంటి నిర్మాణాన్ని అక్రమంగా చేపడుతున్నారు.
- దిశ, కంది
కంది మండలంలోని బేగంపేట గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో గతంలో ఓ తీర్మానాన్ని చేశారు. అదేమిటంటే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ ట్యాంకు పక్కన 130 గజాల ఖాళీ స్థలాన్ని హరితహారం మొక్కలు నాటేందుకు వాడుకోవాలని పంచాయతీ సమక్షంలో తీర్మానించి పుస్తకంలో కూడా ఆమోదిస్తూ రాశారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా స్థానికంగా ఓ వ్యక్తి సర్పంచ్, ఉప సర్పంచ్ అండదండలతో అక్రమంగా ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు.
అంతేకాకుండా ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అప్పటి పంచాయతీ కార్యదర్శి అయిన ధారాసింగ్ సంతకాన్ని కొందరు వ్యక్తులు ఫోర్జరీ చేశారు. ఇదే విషయాన్ని స్థానిక మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కొంతమంది గ్రామస్తులతో కలిసి ఉన్నతాధికారులకు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేశారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని నిర్మాలను ఆపివేయాలంటూ వారు కోరారు.
పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంటేషన్ చేసుకోవడం ఎంతవరకు న్యాయమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే విషయంలో డిఎల్‌పిఓ సతీష్ రెడ్డిని దిశ వివరణ కోరగా.. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. స్థలం ఎవరిది అనేది పూర్వ డాక్యుమెంట్ల ద్వారా పరిశీలించి లీగల్‌గా ఎవరికి చెందుతుందో విచారణ చేపడతామని ఆయన తెలిపారు. అప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు పట్టి స్థలంలో చేయరాదని వారికి సూచించినట్లు చెప్పారు. గ్రామానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
- శ్రీనివాస్ గౌడ్, చిదురుప్ప మాజీ సర్పంచ్
గ్రామ కంఠానికి చెందిన 130 గజాల స్థలంలో సర్పంచ్ అండదండలతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఆ స్థలానికి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధము లేదు. అది గ్రామ పంచాయతీకి చెందిన స్థలం. అక్రమంగా నిర్మాణం చేపడుతున్న సదర్ వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
అక్రమంగా ఇంటి నిర్మాణం
- శ్రీకాంత్ నాయక్, బేగంపేట తండావాసి
ట్యాంకు నిర్మాణం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ విషయం స్థానిక సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. వెంటనే నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నా.