రేపు అసెంబ్లీకి వెళ్లకపోతే అక్కడే వంటావార్పు.. కేసీఆర్‌కు మల్లన్నసాగర్ బాధితుల బహిరంగ లేఖ
మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులు బహిరంగ లేఖ రాశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి మల్లన్న సాగర్ బాధితుల సమస్యలపై మాట్లాడకపోతే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎర్రవెళ్లి ఫాంహౌజ్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు లేఖలో మల్లన్న సాగర్ బాధితుల సమస్యలపై గతంలో కేసీఆర్ కు లేఖ రాశామని, కానీ ఇంతవరకు స్పందించలేదని తెలిపారు. అలాగే తమ సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెబుతున్నారు కానీ అదే విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.
హరీష్ రావు అసెంబ్లీలో మల్లన్న సాగర్ బాధితుల గురించి ప్రస్తావించకపోవడానికి కారణం.. ఆయన చేసిన అవినీతి, అక్రమాలు బయటపడతాయని మాట్లాడటం లేదన్నారు. అంతేగాక మల్లన్న సాగర్ లో ఆయన నిర్వహించిన బ్రోకర్ వ్యవస్థ విషయాలు, ఆర్ అండ్ ఆర్ సోమ్ము అక్రమంగా కాజేసిన విషయాలు బయటికి వస్తాయనే భయంతో మాట్లడటం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు చేసిన పాపాలను కడుక్కోవాలంటే, నిండు అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వసితుల విషయంలో తప్పు చేశామని చెప్పి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని అన్నారు. ఇక ఈ లేఖపై రేపు మధ్యాహ్నం 1.30 గంటలలోపు స్పందించకుంటే.. సరిగ్గా 2.00 గంటలకు ఎర్రవెళ్లి ఫాంహౌజ్ ను ముట్టడిస్తామని, మా సమస్యలపై మీరు అసెంబ్లీలో మాట్లాడే వరకు అక్కడే వంటావార్పు చేస్తామ మల్లన్న సాగర్ నిర్వాసితులు తెలిపారు.
