CPM: స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి: సీపీఎం డిమాండ్
కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిభా అనేది ఎవరి సొత్తు కాదన్నారు. వైకల్యాలు, శక్తి సామర్థ్యాలు మేధోశక్తి పై ప్రభావం చూపదన్నారు. ఓ ఐఎఎస్ అధికారి వికలాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తోందని పేర్కొన్నారు.
బ్రెయిలీ లిపిని అందించిన లూయీస్ బ్రెయిలీ మొదలుకుని, అనేక మంది సివిల్ సర్వెంట్లు, రాజకీయవేత్తలు, డాక్టర్లు వారి వారి రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను చాటుతూ ఉన్నతస్థాయి సేవలందిస్తున్న వాస్తవం మన కళ్ళముందు ఉందికదా! దివ్యాంగుల మనోభావాలను దెబ్బతినేలా చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.