PCC రేసులో ఉన్నా.. మనసులో మాట చెప్పిన మహేష్ కుమార్ గౌడ్
పీసీసీ రేసులో తానూ ఉన్నానని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : పీసీసీ రేసులో తానూ ఉన్నానని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అర్హత ఎవరికి ఉంటే వాళ్లకే పీసీసీ పదవి వరిస్తుందన్నారు. పార్టీలో ఆ పదవి కోసం ఎవరైనా పోటీ పడే స్వేచ్ఛ ఉన్నదన్నారు. అంతిమంగా అన్ని క్రైటేరియాలను పరిశీలించి హైకమాండ్ ఫైనల్ చేస్తుందన్నారు. తాను ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తూ వస్తున్నానని, తనపై హైకమాండ్ ఆశీస్సులు ఉంటాయనే నమ్మకం ఉన్నదన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, సమర్ధవంతంగా పనిచేసేందుకు రెడీగా ఉన్నానని వెల్లడించారు. ఇక వరి ధాన్యం అంశంలో బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ల సంక్షేమానికి ఏం వెలగబెట్టారు? అంటూ ప్రశ్నించారు. రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారని, కానీ బీఆర్ఎస్ చేసిన అరాచకాలన్నీ ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయన్నారు.
కేసిఆర్ ప్రభుత్వంలో రైతులతో ఎలా మెలిగారో? అందరికీ తెలుసునని చెప్పారు. ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ తీసుకువెళ్లిన దారుణాలు ఇంకా రైతుల మెదళ్లలోనే ఉన్నాయన్నారు. కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక మాఫీయాను అడ్డుకుంటే నేరెళ్ళ రైతులపై దాడి చేశారన్నారు. ప్రశ్నించినోళ్లపై పోలీసులతో కొట్టిపించారన్నారు. దేశ వ్యాప్తంగా ఈ సంఘటనపై చర్చ జరిగినా...గత సీఎం కనీసం ఈ అంశంపై మాట్లాడలేదన్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించలేదన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని చెప్పిన కేసీఆర్, ఆయన ఫామ్ హౌజ్ లో వరి వేసుకున్నాడని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇక గత ప్రభుత్వం కన్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి లోనే ఐకేపీ సెంటర్లను తెరిచిందన్నారు. గత ప్రభుత్వం కన్న ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. ఇక రైతులకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తీపి కబురు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.