letter Viral : గొప్ప క్రికెటర్ అయ్యాకే తిరిగి ఇంటికి వస్తా! లేఖరాసి వెళ్లిపోయిన వనస్థలిపురం బాలుడు
నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని, గొప్ప క్రికెటర్ అయ్యాక ఇంటికి తిరిగి వస్తానని ఓ బాలుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని, గొప్ప క్రికెటర్ అయ్యాక ఇంటికి తిరిగి వస్తానని ఓ బాలుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలీపురంలో జరిగింది. తల్లిదండ్రులకు ఆ బాలుడు రాసిన లెటర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘నేను ఈ రోజు వెళ్లిపోతున్న, నాకు చదువులో కన్న క్రికెట్‌లో ఎక్కువగా ఇంట్రస్ట్ ఉంది. నాకు చదువు రాదని కాదు, నాకు చదువు వచ్చు కాని మరీ ఎక్స్‌ట్రార్డ్‌నరి కాదు. నాకు అన్ని కల్పించారు దానిలో ఏది లోటు చేయలేదు. నేను మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకొని కష్టపడకుండా ఉండాలని మీ ఆశ, అది నేను అర్థం చేసుకోగలను, మీరు కష్ట పడినట్లు నేను కష్టపడొద్దని మీ ఆలోచన, మీ కష్టం గురించి నాకు తెలుసు కానీ నాకు క్రికెట్ అంటే ఇష్టం, కానీ మీరు నన్ను అందులో ప్రోత్సహించడం లేదు, దానికి కారణం కూడా ఉంది కానీ నా గురించి కూడా ఆలోచించండి, మీరు నన్ను ఏ పని చేసిన కష్టపడి, మనం అందులో ఫస్ట్ ఉండాలని చెబుతారు. నేను క్రికెట్‌లో కష్టపడుతాను. నేనే ఫస్ట్ ఉండటానికి ప్రయత్నిస్తాను.
కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. డాడీ నీకు ఎలాగైతే స్కూల్‌కి షూ వేసుకోని వెళ్లాలని నీ డ్రీమ్.. నాకు కూడా క్రికెటర్ అవ్వాలని డ్రీమ్, డాడీ నీకు స్టేజీపై ఎలాగైతే మెడల్స్ తీసుకోవాలని ఉందో నాకు కూడా అలాగే స్టేజీపై కప్ తీసుకోవాలని నా ఆశ, నేను క్రికెట్ కోసం ఎంత కష్టపడటానికి కైనా సిద్ధం.. నేను దాన్ని నా ప్రాణం పెట్టైన ఆడతాను. అందుకే నేను వెళ్లిపోవడానికి సిద్దపడ్డాను. క్రికెట్‌లో కూడా ఎక్కువగానే కాంపిటేషన్ ఉంది. దాని దాటి పైకి ఎదగడం చాలా కష్టమే, క్రికెటర్ అవ్వాలని ఆశతో చాలా మంది జీవితాలు కరాబు అయుండొచ్చు, కానీ నేను వాళ్ళ లాగా కాదు, నేను అనుకున్నది సాధించే వరకు పట్టు వదలను, క్రికెట్ కూడా ఒక మంచి ఉద్యోగం లాంటిదే. దానిని మీరు అర్థం చేసుకోవాలి, మీకు నేను ఎలాగైతే చాలా ఇష్టమో నాకు కూడా క్రికెట్ అంటే ఇష్టం. నేను వెళ్లిపోయానని బాధపడకండి. నేను మళ్లీ మంచి క్రికెటర్ అయ్యి తిరిగి వస్తాను, నన్ను చూడకుండా ఉండలేరని నాకు తెలుసు, కానీ నాకు ఇంకో దారి లేదు, నేను నా బట్టలు తీసుకొని వెళ్తున్న.. ఇట్లు శ్రీశాంత్’ అంటూ ఆ బాలుడు తల్లిదండ్రులకు లేఖ రాసి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన లేఖ నెట్టింట వైరల్‌గా మారింది.