బస్సు నడుపలేను.. తీసుకొని పో! మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీలో మహిళ ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. అప్పటి కొన్ని బస్సుల్లో మహిళలు తీవ్ర వాగ్వాదం, కండక్టర్, డ్రైవర్‌తో లొల్లీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ, డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లక్డికాపూల్‌లో ఆర్టీసీ బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించు కునేందుకు డ్రైవర్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఆర్టీసీ డ్రైవర్‌పై సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ‘బస్సు నడపలేను.. బండి తీసుకొని పో’ అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బస్సు నీదా అంటూ డ్రైవర్ పై సదరు మహిళ ఎదురు తిరిగింది. బస్సు ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు మహిళ అడ్డం తిరిగింది. దీంతో బస్సులోని మహిళలు ఉచిత బస్ ఎవరు పెట్టమన్నారంటూ మండిపడ్డారు. ఉచిత బస్ పెట్టి మా ప్రాణాల మీదకు తెస్తున్నారని డ్రైవర్ వాపోయాడు. అయితే, ఈ తతంగం అంతా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.