చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై హైడ్రామా.. సునీత టికెట్ ఆగడం వెనుక రీజన్ ఇదేనా?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి.

Update: 2024-03-09 08:01 GMT

దిశ, డైనమిక్/రంగారెడ్డి బ్యూరో: రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ప్రత్యర్థులను ఢీ కొట్టే గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో చేవెళ్ల అభ్యర్థి విషయంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఫైనలైజ్ అయిన అభ్యర్థుల జాబితా ఇదేనంటూ ఓ లిస్ట్ నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అందులో చేవెళ్ల అభ్యర్థిగా పట్నం సునీతామహేందర్‌రెడ్డి పేరు ఉంది. అయితే ఈ ప్రచారం జరిగన మరికాసేపటికే అధికారిక ప్రకటన వెలువడగా అందులో చేవెళ్ల అభ్యర్థి పేరును హోల్డ్‌లో ఉంచారు. చేవెళ్ల స్థానంలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ పేరును అనౌన్స్ చేశారు. దీంతో చేవెళ్ల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మనసు మార్చుకుందా? అధిష్టానం ఆలోచన వెనుక అసలు వ్యూహం ఏంటి? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఆ రెండు కుటుంబాలకు టికెట్ డౌటే?

రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి పట్లోళ్ల, పట్నం కుటుంబాలదే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. గతంలో ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో లేకపోయినా అధికారం మాత్రం తమలో ఒకరి చేతిలో ఉండేలా జాగ్రత్త పడుతూ వస్తున్నారనే చర్చ నియోజకవర్గంలో ఉంది. మొన్నటి వరకు పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. తాజాగా పట్నం సునీతామహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అయితే పట్నం సునీతకు కాంగ్రెస్‌లో చేవెళ్ల ఎంపీ టికెట్ ఖాయం అనే చర్చ ఇన్నాళ్లు జరిగింది. ఈ క్రమంలో మారిన సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఈసారి పోటీ చేయవద్దనే ఆలోచనతో ఉన్నారని, దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది కీలకంగా మారింది. ఇక్కడ బీజేపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సబిత లేదా ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి అవకాశం ఇస్తే ఫ్యామిలీ రాజకీయాల్లో ఆధిపత్య పోరుతో నష్టపోవడం ఖాయం.. అని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో పడ్డాయనే టాక్ సెగ్మెంట్‌లో వినిపిస్తోంది. అందువల్లే సునీత పేరును కాంగ్రెస్ హోల్డ్‌లో పెట్టిందని బీఆర్ఎస్ అధిష్టానం సైతం సబితారెడ్డి ఫ్యామిలీకి బదులు మరో ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ వైపు రంజిత్‌రెడ్డి!

సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఈసారి పోటీకి దూరండా ఉండాలని భావించినప్పటికీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పట్నం సునీత కంటే ముందే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ అంతలోనే సునీత చేరికతో ఆయన బీజేపీ వైపు వెళ్లాలనే ఆలోచన చేసినా అక్కడ అభ్యర్థి ఖరారు కావడంతో తిరిగి కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. పట్లోళ్ల వర్సెస్ పట్నం ఈక్వేషన్స్‌తో సునీతకు కాంగ్రెస్‌లో టికెట్ దక్కకుంటే ఆ అవకాశం తనకు కలిసి వస్తుందని రంజిత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చేవెళ్ల ఎంపీ స్థానం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News