TG: హైడ్రా మరో కీలక నిర్ణయం
చెరువులు పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం
దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించేందుకు ఉద్దేశించిన హైడ్రా ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించడానికి సిద్ధమైంది. ఇందుకు ప్రతి సోమవారాన్ని(ప్రభుత్వ సెలవులు మినహాయించి)కేటాయించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు,నాలాలు, పార్కులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలను కూడా స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు, తిరిగి 3.00 గంటల నుంచి 5.30 గంటల వరకూ రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకుని కార్యాయానికి రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 29560596 నంబర్లలో సంప్రదించాలన్నారు.