Hydra: హైడ్రా అధికారులకు భార్యాపిల్లలున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

హైడ్రా అధికారులకు కూడా భార్యాపిల్లలున్నారని, నిరుపేదల ఉసురు మంచిది కాదని, పట్టాదారులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-23 08:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా అధికారులకు కూడా భార్యాపిల్లలున్నారని, నిరుపేదల ఉసురు మంచిది కాదని, పట్టాదారులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి చెరువులో హైడ్రా కూల్చివేతలపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన హైడ్రా అధికారులపై ఫైర్ అయ్యారు. బాధితులకు రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేతలు చేపడుతున్నారని, కనీసం వారికి ఇంట్లోని సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. చెరువులను కూల్చివేయడం మంచి పనే కానీ దాని వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం అందజేయాలని, భూపట్టాదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ.. హైద్రాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు.

అలాగే శని ఆది వారాల్లో వందలమంది పోలీసులతో ఎస్కార్ట్ గా బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చివేస్తే.. అమాయకులు రోడ్డున పడుతున్నారని, మీకు కూడా భార్యాపిల్లలున్నారు. నిరుపేదల ఉసురు మంచిది కాదని చెప్పారు. ఇక కూల్చివేతలు చేపట్టిన భూమిపై హై కోర్టు, జిల్లా కోర్టులు వేర్వేరుగా ఆర్డర్లు ఇచ్చాయని, దీనిపై హైడ్రా అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడేదో చెరువులను ఉద్దరించినట్లు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లు చెరువులకు పెన్షింగ్ వేసి రక్షించామని తెలిపారు. నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని, కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కూల్చివేతలు చేసాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని, వాటిని వెంటనే తొలగించాలని అన్నారు. ప్రజలను సంక్షేమ పథకాల నుంచి దారి మళ్లించేందుకే హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.


Similar News