HYDRA: చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని, నిర్మాణాలను కూల్చి చెరువులను కాపాడటం తమ ఉద్దేశం కాదని ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని, నిర్మాణాలను కూల్చి చెరువులను కాపాడటం తమ ఉద్దేశం కాదని ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) అన్నారు. ఇవాళ ‘హైడ్రా’ బ్రెయిన్ స్టోర్మ్ ('Hydra' Brainstorm) సమావేశంలో పాల్గొ్న్న ఆయన మాట్లాడుతూ.. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చివేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక నుంచి ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో నూతన నిర్మాణాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటామని అన్నారు. ముందుగా చెరువులో నీటి విస్తీర్ణం, శాటిలైట్ మ్యాప్ (Satellite Maps)లు, పంచాయతీల్లో మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా (Survey of India) మ్యాప్‌లను ప్రామాణికంగా తీసుకుంటామని అన్నారు.
అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఇళ్లను నిర్మిస్తే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా సరే కూల్చేస్తామని స్పష్టం చేశారు. ఆక్రమణల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వాడుతున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే తమకు అలర్ట్ వస్తుందని పేర్కొన్నారు. అమీన్‌పూర్ (Ameenpur) తూములు మూయడంతో లేఅవుట్లు మునిగాయని.. తప్పుడు అనుమతులు ఇచ్చిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామని క్లారిటీ ఇచ్చారు. కొంతమందిపై చర్యలతో ‘హైడ్రా’ (HYDRA) పని అందరికీ తెలిసిందని, ప్రజల్లో ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zones)పై అవగాహన వస్తుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు.