విపత్తు నిర్వహణపై హైడ్రా కమిషనర్ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్(Hyderabad) లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుండి కాపాడటానికి ప్రత్యేక 'హైడ్రా'(Hydra) కమిషన్ ఏర్పాటు చేయబడిన విషయం తెలిసిందే.

Update: 2024-10-09 13:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుండి కాపాడటానికి ప్రత్యేక 'హైడ్రా'(Hydra) కమిషన్ ఏర్పాటు చేయబడిన విషయం తెలిసిందే. అయితే హైడ్రాకు కమిషన్ విపత్తు నిర్వహణ సంస్థలోని ఒక భాగంగా ముందు ఏర్పాటు చేశారు. అటు తర్వాత కమిషన్ చట్టబద్దతపై కోర్టులో పలు కేసులు నమోదవగా.. ప్రభుత్వం హైడ్రా కోసమే ప్రత్యేక చట్టాన్ని తయారు చేయగా, గవర్నర్ కూడా ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అయితే కేవలం చెరువుల, ప్రభుత్వ భూముల ఆక్రమణలను మాత్రమే కాకుండా.. నగరంలో విపత్తు నిర్వహణ విధులు కూడా హైడ్రా నిర్వహిస్తోంది. బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, తన బృందంతో బెంగుళూర్ విపత్తు నిర్వహణ అధికారులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఆ నగరంలో వరదల నిర్వహణపై చేపడుతున్న చర్యల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా బెంగుళూర్ నగరంలో అనుసరిస్తున్న ప్రత్యేక విధానాల గురించి కర్ణాటక విపత్తు నిర్వహణ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే హైదరాబాద్ లో 'హైడ్రా' పనిచేస్తున్న విధానాల గురించి అక్కడి అధికారులకు కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు.   

ఈ సందర్బంగా రంగనాథ్ మాట్లాడుతూ బెంగ‌ళూరుతో పాటు దేశంలోని ఇత‌ర ప‌ట్టణాల్లో అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్యయ‌నం చేసి స‌మ‌న్వయంతో మెరుగైన వ్యవ‌స్థను రూపొందించ‌డానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం న‌గ‌రంలో అనుస‌రిస్తున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధానాల‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా, స‌మ‌న్వయంగా రూపొందించ‌డం. ప్రజ‌ల‌ను ముందుగానే అప్రమ‌త్తం చేసి.. యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచే పని చేస్తున్నామని తెలిపారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఇత‌ర కార‌ణాల‌తో నెల‌లో ప‌డే వ‌ర్షం ఒక్క రోజులో.. ఒక్క రోజులో ప‌డే వ‌ర్షం గంట‌, అర‌గంట‌లో కురవ‌డంతో త‌లెత్తుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేలా తీసుకునే చ‌ర్యలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ప్రాంతాల‌వారీ వెద‌ర్ రిపోర్టు ప్రజ‌ల‌కు చేరేలా చ‌ర్యలు, ఎంత వ‌ర్షం ప‌డుతుందో, వ‌ర‌ద ముప్పు, వ‌డ‌గ‌ళ్లతో పాటు పిడుగుపాట్ల హెచ్చరిక‌లు కూడా ప్రజ‌ల‌కు తెలిజేసేలా చ‌ర్యలుంటాయని వెల్లడించారు. గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ ప‌రిధిలో డివిజ‌న్ల వారీ వెద‌ర్ స్టేష‌న్ల నుంచి స‌మాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేయ‌డంతోపాటు ర‌హ‌దారుల్లో కిలోమీట‌ర్ల మేర వ‌ర్షపు నీరు ప్రవ‌హించ‌కుండా ఎక్కడిక‌క్కడ వ‌ద‌ర నీటి కాలువ‌ల్లోకి నీరు చేరేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ‌ర‌ద‌లు, ముంపు సంభ‌విస్తుంద‌ని గ్రహించి అక్కడి ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. వ‌ర‌ద ముప్పు ఉన్న ప్రాంతాల్లో వ‌ర‌ద నీటి కాలువ‌ల‌ ప్రవాహ స్థాయిని అంచ‌నా వేసేందుకు బెంగ‌ళూరులో అమ‌ర్చిన సెన్సార్‌ల ప్రయోజ‌నాల‌పై స‌మీక్ష. అలాగే నాలాల్లో చెత్త పేరుకుపోకుండా చ‌ర్య‌లు తీసుకోబోతున్నామని వివరించారు.

 


Similar News