CM Revanth Reddy : ఇక నుంచి ప్రతి ఏటా అధికారికంగా సదర్ సమ్మేళనం

సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రకటించారు.

Update: 2024-10-27 12:39 GMT

దిశ, ముషీరాబాద్: సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రకటించారు. ఇక నుంచి ప్రతీ ఏటా నిర్వహించాలని వేదిక పై నుంచి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తాను పిసిసి అధ్యక్షునిగా ( President of PCC ) గతంలో నారాయణగూడ సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలనలో సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పానన్నారు.


దీపావళి పండుగ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ( Legislative Assembly Speaker Gaddam Prasad ), రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ( State Minister Ponnam Prabhakar ) , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రకాశం చేసి, శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేసి సదర్ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.


అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదన్నారు. యాదవ సోదరుల అండదండలు ఉన్నాయి కాబట్టే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని అన్నారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని చెప్పారు. సదరు ఉత్సవాలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ఉత్సవాలు కేవలం యాదవులకే కాదు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పారు. సదరు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బాధ్యతను అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ కుమార్ యాదవులకు అప్పగిస్తున్నానని చెప్పారు.



యాదవులు రాజకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించానని అన్నారు. యాదవులు హక్కుల కోసం కొట్లాడాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎన్ని డైరీలు ఉన్న నగరంలో పేదోడి నుంచి పెద్దోడి వరకు పాలు అందేది యాదవులతోనే అన్నారు. పశువులను పూజించడం యాదవుల ప్రత్యేకత అన్నారు. మూసీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మూసీమురికిలో బతుకుతున్న వారి జీవితాలను మార్చాలన్నారు. మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని చెప్పారు. 

ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలన్నారు. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని ఆయన అన్నారు. యాదవ సోదరులు అవాకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఆనాడు ముషీరాబాద్ లో అంజన్ అన్నను గెలిపించి ఉంటే మీ వైపు నుంచి ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారన్నారు. అంజన్ అన్న ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలని సోనియాను ఒప్పించి రాహుల్ ని మెప్పించి మల్లికార్జున ఖర్గేతో ( Mallikarjuna Kharge ) అనిల్ కు రాజ్యసభ ఇప్పించానన్నారు.

రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) భారత్ జూడో యాత్ర సందర్భంగా కుమార్ యాదవ్ కుటుంబం సదర్ ప్రాముఖ్యతను ఆయనకు పరిచయం చేసిందని చెప్పారు. కౌరవులు వందమంది ఉన్న పాండవులు ఐదుగురే అయినా శ్రీకృష్ణుడు రాజనీతితో ధర్మం వైపే నిలబడ్డారని గుర్తు చేశారు. ధర్మాన్ని మనం నిలబెడితే అది మనం గెలిపిస్తుందని అన్నారు. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి అధర్మాన్ని ఒడిద్దాం అని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం అంటే యాదవుల అడ్డా అని సదర్ సమ్మేళనంతో నిరూపించారని ఈ సందర్భంగా యాదవులను సీఎం అభినందించారు.

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ… ప్రభుత్వపరంగా సదరు ఉత్సవాలు జరపడం గర్వకారణం అన్నారు. తాను చిక్కడపల్లి నారాయణగూడ ప్రాంతంలో ఉండేవాడినని, చిన్నప్పటి నుంచి సదరు ఉత్సవాలను చూసేవాడిన అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో సదర్ ఉత్సవాలను చూడడం ఇదే మొదటిసారి అని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… గోమాతను, పశువులను పూజించడం యాదవుల సంస్కృతి అని చెప్పారు. అనేక ఉత్సవాలు రాష్ట్ర పండుగలుగా జరుగుతున్నాయని సదర్ సమ్మేళనాన్ని కూడా రాష్ట్ర పండుగగా జరపాలని యాదవ సోదరులు కోరుకుంటున్నారని, ఈ అంశాన్ని పరిశీలించి సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు. యువజన కాంగ్రెస్ నుంచి నాయకునిగా ఎదిగిన అనిల్ కుమార్ యాదవ్ కు అత్యున్నతమైన రాజ్యసభ ఇచ్చి యాదవులకు ముఖ్యమంత్రి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చారని అన్నారు. యాదవులకు ఈ సందర్భంగా దీపావళి, సదర్ శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ మంత్రి, సభ్యులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ… హైదరాబాదులో సదర్ ఉత్సవాలు ప్రత్యేకమైనవి అన్నారు. కులమతాలకు అతీతంగా సదర్ వేడుకలు జరుగుతాయన్నారు. గతంలో ఎవరు గుర్తించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సదరు ఉత్సవాలకు గుర్తింపు ఇచ్చాను అని చెప్పారు. ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. అతి చిన్న వయస్సులోనే అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం రేవంత్ కే దక్కిందన్నారు. జాతికి దేశానికి మేలు జరగాలని శ్రీకృష్ణ భగవానుడు చూపించిన దారిలో అందరూ పయనించాలని అన్నారు. ఇందిరాపార్క్ సదర్ సమ్మేళన ప్రాంగణమంతా జై యాదవ్ జై మాధవ్ నినాదాలు విన్నంటాయి. డప్పు చప్పుళ్ళు, బాజా భజంత్రీల కోరుతూ దద్దరిల్లింది. దున్నపోతుల ప్రదర్శన, యువకుల ఆటలు, కర్ర సాములు సదర్ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


Similar News