మహిళలంటే ఇంకా చిన్న చూపే : మాజీ మంత్రి డీకే అరుణ
మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపే అని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.
దిశ, శేరిలింగంపల్లి : మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపే అని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం చందానగర్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డీకే అరుణ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సైనా జైస్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలపై అనునిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయని, మహిళలు అంటే సమాజంలో ఇంకా చిన్నచూపు కనిపిస్తుందని, ఈ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్రప్రభుత్వం అనేకరకాల చర్యలు తీసుకుంటుందని, కొత్త చట్టాలను కూడా తీసుకువచ్చిందని అన్నారు.
ఆడపిల్లలమని దిగులు చెందవద్దని, ఆడ పులిలా ఈ లోకానికి మీరెంటో చూపించాలని, సమాజంలో మీరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమ దేవి, కరణం మల్లీశ్వరి, పీటీ ఉషా, కల్పన చావ్లా, సైనా నెహ్వాల్, ప్రతిభా పాటిల్, ద్రౌపది ముర్ము, ఇందిరా గాంధీ లాంటి గొప్ప గొప్ప వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు. ఏ కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని, విజయం సాధించాలని, ఆడవాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.
ఆడవాళ్లు తలచుకుంటే ఏమైనా సాధించగలరని, మాయ మాటలు చెప్పి మోసం చేసే సీఎం కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లని నమ్మద్దని, మిమ్మల్ని కలిసిన, మీ ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని, మహిళల కోసం ఏం చేశారో అడగాలని సూచించారు. రాష్ట్రంలో దిశా చట్టం ఏమైందని, మీ షీ టీమ్స్ ఏమైపోయాయని అడగాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా రెడ్డి, డాక్టర్ ప్రజ్ఞ, శ్యామల, మాధవి, మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, పద్మ, సింధు రెడ్డి, రేణుక, అరుణ, మహేశ్వరి, లలితారెడ్డి, లలిత, అనిత, మమత, కృష్ణప్రియ, ఇందిరా, వరలక్ష్మితో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.