KTR : కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే కరెంట్​, నీటి కష్టాలు

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి, కరెంట్​ కష్టాలు మొదలయ్యాయని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​ అన్నారు.

Update: 2024-02-03 10:52 GMT

దిశ, కూకట్​పల్లి : తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి, కరెంట్​ కష్టాలు మొదలయ్యాయని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఎన్​కేఎన్​ఆర్​ గార్డెన్స్​లో శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే నీటి, కరెంట్​ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్​లో ప్రజలు బీఆర్​ఎస్​ను ఆదరించి దీవిస్తే గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్​ పార్టీని గెలిపించారని అన్నారు. గ్రేటర్​ పరిధిలో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసిన గ్రేటర్​ వాసులు గులాబీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు.

     108 శాతం ఓట్లతో మాత్రమే బీఆర్​ఎస్​ పార్టీ ఓటమి పాలైందని అన్నారు. ప్రజలు బీఆర్​ఎస్​ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని, ఈసారి ప్రతిపక్షంలో అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్​ ప్రభుత్వంతో పోరాడతామని అన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కాంగ్రెస్​ పాలనను చూస్తే ప్రజలకు బీఆర్​ఎస్​ పాలన గుర్తు వస్తుంది, విలువ తెలిసి వస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్​ ప్రభుత్వం మరిచిందని ఆరోపించారు. ఆడబిడ్డలందరికీ మహాలక్ష్మీ పథకం ఎప్పుడు మొదలవుతుందో ఎదురు చూస్తున్నామని అన్నారు. వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, వంద రోజులు బరాబర్​ వేచి చూస్తామని, ఆ తరువాత ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చెప్పడం హాస్యస్పదంగా ఉందని అన్నారు.

    రాష్ట్రాన్ని, హైదరాబాద్​ నగరాన్ని అభివృద్ధి చేసి మీ చేతిలో పెట్టాము, ఆ అభివృద్ధిని నిలుపుకుంటారా..? లేదా అనేది చూడాలని అన్నారు. 70 ఏండ్ల వయస్సు గల మాజీ ముఖ్యమంత్రి బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తిడుతూ అనుచితంగా మాట్లాడుతున్నారని, ఓపిక నశిస్తే తాము అదే పద్దతిలో మాట్లాడతామని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ వస్తేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అంటూ రేవంత్​ రెడ్డి రాజకీయ దివాలకోరుతనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్​లో తెలంగాణ గురించిన గళం విప్పాలన్నా, మాట్లాడలన్నా బీఆర్​ఎస్​ ఎంపీపిలు కావాలని, కాంగ్రెస్​, బీజేపీ ఎంపీలు మాట్లాడలేరని అన్నారు. ఫ్రీ బస్తు సౌకర్యం మంచిదే కానీ 35 మంది ఎక్కాల్సిన బస్సులు 50 నుంచి 60 మందిని ఎక్కిస్తున్నారని, డ్రైవర్​ సీట్​లు, కిటికీల నుంచి ఎక్కుతున్నారని,

    మహిళలు చెప్పులతో కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు కల్పించే సమయంలో పురుషులకు తగిన న్యాయం చేయాలని, అదే విధంగా ఫ్రీ బస్సులతో నష్ట్ర పోతున్న ఆటో డ్రైవర్​లను ఆదుకుంటామని, నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఇంత వరకు ఎవరిని ఆదుకోలేదన్నారు. ఇప్పటి వరకు 16 మంది ఆటో డ్రైవర్​లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఆటో డ్రైవర్​లకు నెలకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు, కార్పొరేటర్​లు జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీషా, ముద్దం నర్సింహయాదవ్​, మందాడి శ్రీనివాస్​ రావు, పండాల సతీష్​ గౌడ్, సబీహ బేగం, ఆవుల రవీందర్​ రెడ్డి, మాజీ కార్పొరేటర్​ తూము శ్రావణ్​ కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News