సర్వేనెంబర్ 28 లోని బస్తీలను రక్షించుకుంటాం : వనం సుధాకర్
మియాపూర్ సర్వేనెంబర్ 28 లోని బస్తీలను రక్షించుకుంటామని ఎంసీపీఐ(యు)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ అన్నారు.
దిశ, మియాపూర్ : మియాపూర్ సర్వేనెంబర్ 28 లోని బస్తీలను రక్షించుకుంటామని ఎంసీపీఐ(యు)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ అన్నారు. మంగళవారం నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం కమిటీ భవనం లో నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ వాసులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాభై సంవత్సరాలుగా వివిధ జిల్లాల నుంచి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఈ బస్తీలలో సుమారు రెండు వేల కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు. మియాపూర్ 28 సర్వేనెంబర్ మొత్తం 384 ఎకరాలలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భారీ భవనాలు, ఇతరాత్ర ఈ భూమిని కబ్జాచేసి లాభాలు అర్జిస్తున్నారన్నారు.
ఇదే సర్వే నంబర్ లో గిరిజనులు నివాసం ఉండే నడిగడ్డ తండా 25.32 ఎకరాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త సేకరించే వారితో కూడిన ఓంకార్ నగర్ 10.28 ఎకరాలలో, భవన నిర్మాణ పనులు చేసే కూలి వాసులతో కూడిన సుభాష్ చంద్రబోస్ నగర్ 12.03 ఎకరాలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలుగా ఉంటుంన్నారని, ఆ నివాసాలకు చట్టబద్ధత కల్పించాలని అధికార ప్రతిపక్ష పార్టీలను మొరపెట్టుకున్నారన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా వారికి చట్టబద్ధత కల్పించలేదన్నారు.
సర్వేనెంబర్ 28 లోని భూమిని శత్రు దేశాల ఆస్తులు (ఎనిమి ప్రాపర్టీస్) కింద చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం 2016 నుండి సీఆర్పీఎఫ్ బలగానికి కేటాయించారని తెలిపారు. 28 సర్వేనెంబర్ లోని ఎనిమి ప్రాపర్టీస్ ఆస్తులను అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే ఖబర్దార్ అని హెచ్చరించారు. మైదంశెట్టి రమేష్, ఇ. దశరత్ నాయక్ , వి తుకారాం నాయక్, ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, నడిగడ్డతండా గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాయిని, రత్న కుమార్, దేవనూర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.