విజ్ఞతతో ఓటేసిన సికింద్రాబాద్ ఓటర్లు
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో ఏ ఇతర నియోజవర్గంలో లేని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కోసం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ లు పోటీ పడ్డారు. సుమారు ఆరు నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వారు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
అయితే స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ మరోమారు ఎంపీగా పోటీ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించినట్లుగా ఫలితాల సరళిని బట్టి చూస్తే అర్ధం అవుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఏ ఇతర నియోజకవర్గాలకు లేని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇది పూర్తిగా పట్టణ ప్రాంత ఓటర్లతో కూడిన నియోజకవర్గం. ఇక్కడ దాదాపుగా 85 శాతానికి పైగా అక్షరాస్యులు ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే ఇతర ఎంపీ సెగ్మెంట్లలో లేని విధంగా 45 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఓటర్లు మాత్రం విజ్ఞతతో ఓటేశారనే టాక్ అంతటా వినబడుతోంది.
ఇద్దరిలో ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు...
సికింద్రాబాద్ సెగ్మెంట్ నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ , బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఇద్దరిలో ఎవరు గెలిచినా వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యేది. దానం నాగేందర్, పద్మారావు గౌడ్ లపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఉప ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున ప్రజా ధనం వృథా అయ్యేది. అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా మరోమారు ఎన్నికల విధులు నిర్వహించాల్సి వచ్చేది. ఇక్కడి ఓటర్లు విజ్ఙులు కావడంతో వారికి ఓట్లేయకుండా బీజేపీకి ఓట్లు వేశారనే అభిప్రాయాలు అంతటా వినబడుతున్నాయి.