ఏపీకే ఫైల్ తో ఫోన్ లోకి వైరస్...బాధితుడి నుంచి రూ. 1.18 లక్షలు లూటీ
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నట్లు వాట్సాప్ లో ఆఫర్ పంపించి నగదు ఖాతాను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు
దిశ, సిటీ క్రైమ్ : క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నట్లు వాట్సాప్ లో ఆఫర్ పంపించి నగదు ఖాతాను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. వెంటనే ఏపీకే ఫైల్ ద్వారా పంపిన వైరస్ తో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ ను హ్యాక్ చేసి బాధితుడి నుంచి కొట్టేసిన రూ. 1.18 లక్షలను తిరిగి బాధితుడి ఖాతాకు చేర్చారు. గురువారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి వాట్సాప్ లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మెసేజ్ వచ్చింది. అదే సమయంలో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకుని మీకు క్రెడిట్ కార్డు లిమిట్ పెరగాలంటే మేము పంపిన ఏపీకే ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పి , చేయించారు.
ఏపీకే ఫైల్ డౌన్ అవ్వగానే వైరస్ ఫోన్ లోకి ప్రవేశించి అతని ఫోన్ ను మొత్తం వారు కంట్రోల్ కు తీసుకున్నారు. అలా బాధితుడి ప్రమేయం లేకుండానే అతని ఖాతా నుంచి రూ. 1.18 లక్షలు కొట్టేశారు. అప్రమత్తమైన బాధితుడు వేగంగా సైబర్ క్రైమ్ పోర్టల్ తో పాటు 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడి మొబైల్ ఫోన్ నుంచి ఆ వైరస్ ను తీసేసి , బాధితుడి ఖాతా నుంచి కొట్టేసిన డబ్బుతో సైబర్ దొంగలు ఫ్లిప్ కార్ట్ లో ఆన్ లైన్ షాపింగ్ చేసినట్లు గుర్తించి వారికి ఫిర్యాదు చేసి మొత్తం నగదును తిరిగి బాధితుడి ఖాతాలోకి వచ్చేలా చేశారు. బాధితులు ఎవరైనా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతే వేగంగా 1930 లేదా డయల్ 100 లేదా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.