దిశ ప్రతినిధి, హైదరాబాద్: పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు 2022కు హైదరాబాద్‌కు చెందిన శరత్ చంద్ర, మాధవిల కుమారుడు విరాట్ చంద్ర(8) అందుకున్నారు. గతేడాది మార్చి 6వ తేదీన ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అతిపిన్న వయస్సులో అధిరోహించినందుకు విరాట్ చంద్ర ఈ అవార్డును పొందారు. అత్యధికంగా 40 డిగ్రీలు, అత్యల్పంగా రక్తాన్ని సైతం గడ్డ కట్టించేలా మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడంతో అతని ప్రతిభను గిన్నిస్ బుక్ ఆఫ్ ఆసియా, గిన్నిస్ బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్ వారు కూడా గుర్తించి రికార్డును నమోదు చేశారు. 75 రోజుల పాటు కఠోరంగా శ్రమించడం వల్ల అతి పిన్న వయస్సులోనే విరాట్ చంద్ర ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉండగా, సోమవారం వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రితో నిర్వహించిన కార్యక్రమంలో విరాట్ చంద్రకు బాల పురస్కార్ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అరుదైన ఘనత సాధించిన విరాట్‌ను ప్రధానితో పాటు కేంద్ర మంత్రి అభినందించారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వరరావు, బీఆర్బీ కో-ఆర్డినేటర్ సుమలత తదితరులు పాల్గొన్నారు.