వికసిత్ భారత్ అంటే మనసు, శరీరం దృఢంగా ఉండాలి

వికసిత్ భారత్ అంటే మనసు, శరీరం దృఢంగా ఉండాలి అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

Update: 2024-09-02 10:14 GMT

దిశ,కార్వాన్ : వికసిత్ భారత్ అంటే మనసు, శరీరం దృఢంగా ఉండాలి అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషక ఆహార మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికీ పోషక ఆహారం అనే కార్యక్రమం పై ఐదు రోజుల ఎగ్జిబిషన్ ను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ విజ్జు లత, సీబీసీ ఏజీడీశ్రుతి పాటిల్, శాస్త్రవేత్త డాక్టర్ జి.బాను ప్రకాష్ రెడ్డి లతో కలిసి ఫొటో ఎగ్జిబిషన్, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల స్టాళ్లను గవర్నర్ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ. విద్యా సంస్థలు, విద్యార్థులు, పోషక ఆహార పదార్థాల పైన ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. వికసిత్ భారత్ అంటే అందరూ అనుకున్నట్లు ఆర్థికంగా భారతదేశం బలంగా ఉండడం కాదని, మనస్సు శరీరం దృఢంగా ఉంటేనే వికసిత్ భారత్ అవుతుందన్నారు. 100 సంవత్సరాల మహిళ విశ్వవిద్యాలయానికి గవర్నర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు నవ భారత నిర్మాణం కోసం కృషిచేయాలన్నారు.

    తమ త్రిపుర రాష్ట్రంలో పోషక ఆహార పదార్థాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కళాకారులు, జానపద గేయాల రూపంలో మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చక్కటి కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా రావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ ను ప్రొఫెసర్ విజ్జులత మేమెంటో తో ఘనంగా సత్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళ విశ్వ విద్యాలయ విద్యార్థినిలు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News