మేయర్ దత్తత ఉత్తిదేనా ?

ఆచెరువును నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గత ఏడాది దత్తత తీసుకొన్నది.

Update: 2023-05-23 16:23 GMT

దిశ, మియాపూర్ : ఆచెరువును నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గత ఏడాది దత్తత తీసుకొన్నది. దీంతో అక్కడ ఎవరికీ అందని రీతిలో అభివృద్ది పరుగులు పెట్టి ఉంటుందని ఇంగిత జ్ఞానం ఉన్న వారెవరైనా అనుకుంటారు. కానీ అక్కడ ఉండే వాస్తవ పరిస్థితులు చూస్తే నివ్వెరపోవడం మనవంతవుతుంది. అక్కడ దీర్ఘకాలంగా అంటే సుమారు 4 ఏండ్లుగా  మురుగు సమస్య పరిష్కరించలేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టు పక్కల ఉండే సుమారు 40 కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు దాంట్లోనే కలుస్తుండడంతో పరిసర కాలనీల ప్రజలు గత నాలుగేండ్లుగా తీవ్ర దుర్గంధంతో కలుషిత వాతావరణంలో అనారోగ్యాల బారిన పడి తీవ్రమైన మనోవేదన చెందుతున్నామని చెప్పడం గమనార్హం. ఆ చెరువే చందానగర్ సర్కిల్ 21 హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డులో వైశాలినగర్ ను అనుకొని ఉన్నఈర్ల చెరువు. అయితే ఈర్ల చెరువును గత సంవత్సరమే  దత్తత తీసుకున్నప్పటికి అభివృద్ధికి  ఏ మాత్రం నోచుకోలేదు. దీంతో  మేయర్  దత్తత చెరువు అభివృద్దే ఇలా ఉంటే ఇతర చెరువులకు వారిచ్చే  ప్రాధాన్యం అర్ధం చేసుకోవచ్చని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భరించలేని దుర్గంధంతో గత నెల 28న ట్విట్టర్ లో మంత్రి, కమిషనర్, మేయర్ కు ఫిర్యాదు..

చందానగర్ సర్కిల్ - 21 హఫీజ్ పేట్ డివిజన్ (109) పరిధిలో మదీనాగూడ  మంజీర పైప్ లైన్ రోడ్డును ఆనుకొని వైశాలినగర్ ను అనుకోని ఈర్ల చెరువు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది.  అయితే నగరాభివృద్ధిలో భాగంగా కాలక్రమేణా చుట్టూ ఎన్నో నూతన కాలనీలు అవతరించాయి. దీంతో చుట్టుపక్కల ఉండే సుమారు 40 కాలనీనుంచి మురుగు నీటి కాల్వల నుంచి వచ్చే నీరు చెరువలో కలవడంతో కాలుష్య కాసారంగా తయారయ్యింది. చెరువులోకి చేరిన మురుగు నీటితో పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర దుర్గంధంతో ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. దీనితో పాటు బోర్‌వెల్ నీరు కూడా కలుషితం అయి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యతో చుట్టూ ఉండే 10 కాలనీల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏప్రిల్ 28న మంత్రి కేటీఆర్, కమిషనర్, మేయర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.

సమస్య భరించలేక చెరువులోని మురుగు నీటిని బయటకు వదిలిన వైనం..

ఎగువన ఉన్న మై హోం తదితర గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఇబ్బందులు కలగకుండా అక్కడ నుంచి ఇక్కడ వరకు మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు చేసి చెరువు ఇన్ లెట్ వద్ద వదిలేశారు. అయితే బడా బాబులకు ఒక రూల్ మాకొక రూలా అంటూ 10 కాలనీల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ రోజుకు  దుర్వాసన సమస్య తీవ్రమవడంతో  భరించ లేక కొంతమంది అవుట్ లెట్ వద్ద జేసీబీ సాయంతో మురుగు నీటిని బయటకు వదిలి వేయడం గమనార్హం. నాలుగు ఏళ్లుగా ఈ సమస్య  ఇలా ఉంటే నెలలో రెండు మూడు సార్లు చెరువును మేయర్ సందర్శిస్తూ సమస్యను  పరిష్కారం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News