కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరాచకమే: Kishan Reddy
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక భుజంపై అక్బరుద్దీన్, మరో భజంపై అసద్‌ను పెట్టుకుని తిరుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ....
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక భుజంపై అక్బరుద్దీన్, మరో భజంపై అసద్‌ను పెట్టుకుని తిరుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సోమాజిగూడలో బీఆర్ఎస్ నుండి గోషామహల్ టికెట్ ఆశించిన భంగపడ్డ ప్రేమ్ సింగ్ , నాగార్జునసాగర్‌కు చెందిన పలువురు నేతలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీట్ల కోసం చేరుతుంటారని, అది సహజంగా జరిగే ప్రక్రియ అని చెప్పారు. కానీ ప్రేమ్ సింగ్ రాథోడ్ ఏం ఆశించకుండా బీజేపీలో చేరారని తెలిపారు. మోడీ ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు. పీఎంతో పాటు అమిత్ షా, యోగి, రాజ్ నాథ్ సింగ్, హిమాంత బిశ్వ శర్మ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారని తెలిపారు. 111 మంది అభ్యర్థులు బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారని, ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. దీపావళి తర్వాత విస్తృత ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మజ్లిస్, బీజేపీ ఒక్కటేనని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు . తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్‌తో కలవబోమని, మత కలహాలు చేసే పార్టీతో తాము కలిసేది లేదని తేల్చి చెప్పారు. మజ్లిస్‌తో లాభపడింది, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. కర్ణాటక ప్రజల నెత్తిన కాంగ్రెస్ భస్మాసుర అస్త్రం పెట్టిందన్నారు .
ఐదేళ్ళలో చేయాల్సిన నష్టం 5 నెలల్లోనే జరిగిపోయిందని తెలిపారు. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు అధికారం లేదని, అవురావురుమంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ళు అధికారంలోకి వస్తే అరాచకమే సృష్టిస్తారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రెండుచోట్ల, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి, నియంతృత్వ చీకటి అలుముకుందని ఈ చీకటి డిసెంబర్ 3 తో రాష్ట్రంలో కమ్ముకున్న 'కారు' అధికారంలోకి వస్తామనుకుంటున్న 'మసక' కాంగ్రెస్ చీకటి నుండి పారద్రోలాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు .