సీఎం కేసీఆర్ స్వార్థాన్ని రాస్తే.. పెద్ద గ్రంథాలే సిద్ధమవుతాయి: Kishan Reddy
ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు చేరాక బోడ మల్లన్న అన్న చందంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ...
- ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు చేరాక బోడ మల్లన్న
- ఇదీ సీఎం కేసీఆర్ తీరు
- ఆయన అవసరాల కోసం మహామహులను వాడుకున్నారు
- రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ వద్ద నక్క వినయాలు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు చేరాక బోడ మల్లన్న అన్న చందంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. సబ్బండ వర్గాల ఉద్యమాన్ని స్వార్థంతో మింగేసి నాయకుడిగా నటించడం ఆయనకే చెల్లిందని చురకలంటించారు. జలదృశ్యంలో కొండాలక్ష్మణ్ బాపూజీ వంటి బీసీని, గాంధేయవాదిని వాడుకున్నారని, ఆ తర్వాత బాపూజీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసన్నారు. గాదె ఇన్నయ్య, విజయరామారావు, రవీంద్రనాయక్, మేచినేని కిషన్ రావు వంటి నాయకులెందరినో విజయవంతంగా పక్కకు తప్పించడం కేసీఆర్‌కు ఉన్న ప్రత్యేక నైపుణ్యానికి ఒక ఉదాహరణ మాత్రమేనని కిషన్ రెడ్డి చురకలంటించారు.
ఆచార్య జయశంకర్ వంటి నిఖార్సయిన తెలంగాణ వాది భుజాల మీద ఎక్కి మేధావులను ముగ్గులోకి లాగారని కిషన్ రెడ్డి లేఖలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల వద్ద నక్క వినయాలు ప్రదర్శించి సానుభూతి పొందేందుకు ప్రయత్నించారన్నారు. సెంటిమెంటును వాడుకుని ఎన్నికల్లో గెలవడం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని విమర్శించారు. తెలంగాణ కోసం సకలజనులు కష్టపడితే చివర్లో ఆయన, ఆయన కుటుంబసభ్యులే తెలంగాణ తెచ్చామన్నట్లు పోజులివ్వడం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్వార్థాన్ని గురించి రాస్తే.. పెద్ద గ్రంథాలే సిద్ధమవుతాయని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.