Non-social activities: ఆలయ పరిసరాల్లో ఇవేం పనులు.. పద్మనాభా!
ఆలయాలను హైందవ సమాజం ఎంతో పవిత్రతకు మారు పేరుగా భావిస్తారు.
దిశ, గండిపేట్: ఆలయాలను హైందవ సమాజం ఎంతో పవిత్రతకు మారు పేరుగా భావిస్తారు. విద్యాలయాలు, ఆలయాలంటే మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఎంతో అత్యున్నతమైనవిగా కొలుస్తాం. అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయాలన్నా కాస్త ఆలోచిస్తారు. అయితే, గండిపేట్ మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ అనంత పద్మనాభ స్వామి ఆలయ సమీపంలో అసాంఘిక కార్యకలాపాలను విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. బెదిరింపులు, దాడులు చేస్తుండడంతో అందరూ జంకుతున్నారు. ఆలయానికి సమీపంలో ఇంత జరుగుతుండడంతో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం అటుగా రావడం లేదు. దీంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, భక్తులు ఆలయ సమీపంలో ఇలాంటి పనులేంటి అని ఆందోళన చెందుతున్నారు. అలయం పక్కనే మద్యం సేవిస్తూ కనిపిస్తారు. మరికొందరు యువతీ యువకులు అక్కడకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. దీంతో ప్రయాణాలు చేసే వారు, భక్తులు ఆలయానికి వెళ్లే క్రమంలో వీరి ఆగడాలను చూస్తూ వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కాలేజీలకు చదువు కోసం పిల్లలను పంపిస్తే ఇలా వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తుండడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆలయానికి వచ్చే వారు, పూజారులు వారి ఆగడాలను చూసి ఆపేందుకు ప్రశ్నిస్తే వారిపై అసభ్య పదజాలాన్ని ప్రవర్తించడమే కాకుండా వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.
ఈ విషయంపై పోలీసులు అవగాహన కలిగి ఉండి పెట్రోలింగ్ చేయడం లేదా.. తెలియక రావడం లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వారి ఆగడాలను చూసి చేసేదేమీ లేక చూసీ చూడనట్లుగా వెళ్లిపోతున్నారు. గుడి, బడి అంటే ఎంతో పవిత్రంగా ఉండాల్సిన స్థలాలను, ఈ వికృత చేష్టలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధకరమని ప్రజలు అంటున్నారు. ఈ గుట్టపై మద్యం సేవించి వాళ్లల్లో వాళ్లే గొడవలు పడి పరస్పరం దాడులు చేసుకునే ప్రమాదం లేకపోలేదని తెలుపుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించేలా చూడాలని ఆలయానికి వచ్చే భక్తులు కోరుతున్నారు.
అసభ్య ప్రవర్తన చూడలేక..
నిరంతరం ఆలయానికి తరలివెళ్లే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ జరుగుతున్న వికృత చేష్టలను చూసి ప్రయాణికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ సమీపంలో ఇంత బరి తెగించి ఈ పనులు ఏంటని వారిలో వారే మదన పడుతున్నారు. పోలీసులు సరైన క్రమంలో గస్తీ కాస్తే ఇలాంటివి జరగకుండా నిరోధించవచ్చని ప్రజలు అంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం, ఆలయ పవిత్రను దృష్టిలో ఉంచుకొని నిరంతరం పెట్రోలింగ్ వాహనం అక్కడే ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.