పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత

పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రక్షాపురం ప్రధాన రహదారిలో ఉన్న భూలక్ష్మమ్మ దేవాలయంలోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు రెండు అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు.

Update: 2024-08-27 12:11 GMT

దిశ, చార్మినార్ : పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రక్షాపురం ప్రధాన రహదారిలో ఉన్న భూలక్ష్మమ్మ దేవాలయంలోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు రెండు అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన సంతోష్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో కృష్ణాష్టమి రోజున అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు, బీజేపీ నేతలు మరో వర్గంకు చెందిన వారే ఈ విధ్వంసానికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆందోళకు దిగారు. చివరికి ​ పోలీసులు సముదాయించి నచ్చజెప్పడంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆందోళనను విరమించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్​ ఎంపీ మాధవిలత అక్కడికి చేరుకొని ఆలయం ముందు స్థానికులు, బీజేపీనేతలతో కలిసి రోడ్డు పై బైఠాయించారు.

    వివరాల లోకి వెళితే... పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రక్షాపురం ప్రధాన రహదారిలో ఉన్న చారిత్రాత్మక భూలక్ష్మమ్మ దేవాలయంలో కృష్ణాష్టమి రోజున సోమవారం ఉదయం ఆలయంలో మధు పంతులు పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మహేష్​ యాదవ్​ అనే స్థానిక యువకుడు భూలక్ష్మమ్మ ఆలయం గేట్​కి తాళాలు వేసి వెళ్లిపోయాడు. అర్థరాత్రి 11.35 గంటల ప్రాంతంలో బైక్​లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం ముందు చక్కెర్లు కొట్టారు. అనంతరం ఆలయ గేట్​కు వేసిన తాళంను రాయితో ధ్వంసం చేశారు. లోనికి ప్రవేశించి రాయితో భూలక్ష్మమ్మ, నల్ల పోచమ్మ విగ్రహాలను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న అమ్మవారి చిత్ర పటాన్ని పగుల కొట్టారు. వెంటనే అక్కడి నుంచి బైక్​లపై పరారయ్యారు.

     శబ్దం విని ఆలయం వైపునకు మహేష్​ యాదవ్​ వస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్​లపై పరారయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, బీజేపీ నేతలు తాడెం శ్రీనివాస్​, వీరేందర్​ యాదవ్​తో పాటు పలువురు నాయకులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. సంతోష్​నగర్​ పోలీసులతో పాటు టాస్క్​ఫోర్స్​ డీసీపీ వైవీఎస్​ సుధీంద్ర, సౌత్​ ఈస్ట్​ డీసీపీ పాటిల్​ కాంతిలాల్​ సుభాష్​ , టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్​, అడిషనల్​ డీసీపీ జహంగీర్​, టాస్క్​ ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అంతేగాకుండా సమాచారం అందుకున్న ఎంఐఎంకు చెందిన కార్పొరేటర్లు సలీంబేగ్​, ఆజంతో పాటు సమద్​బిన్​ అబ్దాద్​లు సైతం అక్కడికి చేరుకున్నారు.

    మతిస్థిమితం లేని వాళ్లే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని, తాము పట్టిస్తాం అని కార్పొరేటర్​ సలీం బేగ్​ సముదాయించబోయాడు. మతి స్థిమితం లేని వ్యక్తులు డైరెక్ట్​గా ఆలయాన్ని ఎందుకు టార్గెట్​ చేస్తారని, ఆలయంలో విగ్రహాలు ఎలా పగుల కొడుతారని బీజేపీ నేతలు వివాదానికి దిగారు. దీంతో టాస్క్​ఫోర్స్​ డీసీపీ వైవీఎస్​ సుధీంద్ర, సౌత్​ ఈస్ట్​ డీసీపీ పాటిల్​ కాంతిలాల్​ సుభాష్ లు నిందితులను అదుపులోకి తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించుకున్నారు.

ఓవైసీ​ బ్రదర్స్​ క్షమాపణ చెప్పాలి : మాధవిలత..

సమాచారం అందుకున్న హైదరాబాద్​ బీజేపీ కంటెస్టెడ్​ ఎంపీ మాధవిలత మంగళవారం భూలక్ష్మమ్మ ఆలయాన్ని పరిశీలించారు. అమ్మవారి విగ్రహాలు ధ్వంసం అయిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయం ముందు స్థానికులు, బీజేపీ నాయకులతో కలిసి మాధవి లత బైఠాయించారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ రక్షాపురం మెయిన్​ రోడ్​లో భూలక్ష్మమ్మ ఆలయానికి 10 మీటర్ల దూరంలో సంతోష్​నగర్​ పోలీస్​ స్టేషన్​, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ హిందువుల పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి రోజున అమ్మవారి విగ్రహాలు ధ్వంసం కావడం చాలా దారుణమన్నారు. పాతబస్తీలో హిందు, ముస్లింల మధ్య ఎంఐఎం నాయకులు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, అక్బర్, అసద్​ లు వచ్చి క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని మాధవిలత హెచ్చరించారు. 

Tags:    

Similar News