జీహెచ్ఎంసీలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వెటర్నరీ విభాగం
జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెటర్నరీ విభాగం పూర్తిగా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెటర్నరీ విభాగం పూర్తిగా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయడంతో పాటు, రేబీస్ వ్యాధి ప్రబలకుండా యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. కానీ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్లు మొదలుకుని డాగ్ క్యాచర్ వింగ్‌కు మ్యాన్ పవర్ పంపిణీ చేసే కాంట్రాక్టర్ల వరకు సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే తప్పుల తడకలుగా బిల్లులు సమర్పించి క్లెయిమ్ చేయడం ఆనవాయితీగా మారింది. కుక్కల నియంత్రణ విషయంలో ప్రధాన కార్యాలయంలోని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు.
జోన్ల వారీగా విధులు నిర్వహిస్తున్న పలువురు డిప్యూటీ డైరెక్టర్లు దశాబ్దాల వారీగా జీహెచ్ఎంసీలోనే తిష్ట వేయటంతో మేం సీనియర్‌లం, మమ్మల్ని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఆదేశించేదేమిటీ? అంటూ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వెటర్నరీ విభాగానికి సంబంధించి జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ మొదలుకుని సర్కిళ్ల స్థాయిలో విధులు నిర్వర్తించే అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్ల వరకు నెలకొన్న సమన్వయ లోపమే గ్రేటర్‌లో కుక్కల నియంత్రణకు ప్రధాన అడ్డంకిగా మారిందన్న వాదనలున్నాయి. ఏళ్లుగా తిష్టవేసిన డిప్యూటీ డైరెక్టర్లపై అనేక రకమైన అవినీతి, అక్రమాల ఆరోపణలుండగా, మరి కొందరిపై ఏకంగా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నా, కమిషనర్ సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లో ఆంతర్యమేమిటీ? అన్న చర్చ జరుగుతుంది.
లెక్కలు పెంచేందుకే కుక్కల పట్టివేత..
నగరంలోని ఆరు జోన్లలోని వెటర్నరీ విభాగంలో ఎవరికి వారే ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నట్లు సమాచారం. వీధి కుక్కలను పట్టుకొచ్చి, వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. కానీ ప్రతి సర్కిల్‌లో కుక్కల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకే సిబ్బంది, అధికారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో కుక్కకు బయటి నుంచి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి స్టెరిలైజేషన్ చేస్తే ఒక్కో ఆపరేషన్‌కు రూ.1500, వ్యాక్సినేషన్‌కు రూ.700 ఛార్జీలుగా జీహెచ్ఎంసీ చెల్లిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని డాగ్ క్యాచర్ బృందాలు ఒక్కొక్కటి ఒక్కో రోజు గరిష్టంగా 30, కనిష్టంగా 20 కుక్కలను పట్టుకు కావాల్సిందేనంటూ అధికారులు టార్గెట్ విధిస్తున్నారు. వాటిని తీసుకొచ్చి యానిమల్ కేర్ సెంటర్‌లో వదిలిపెట్టే వరకే డాగ్ క్యాచర్ల పని. ఆ తర్వాత వాటికి స్టెరిలైజేషన్, వ్యా్క్సినేషన్లను కేర్ సెంటర్‌లో ఉన్న అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్ చూసుకుంటారు.
కేర్ సెంటర్ సిబ్బందితోనే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్లను..
డాగ్ క్యాచర్లు కుక్కలను తీసుకువచ్చి వదిలిన తర్వాత బయటి డాక్టర్‌ను పిలవకుండా కేర్ సెంటర్‌లోని సిబ్బందితోనే వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లను, వ్యాక్సినేషన్లను చేస్తున్నట్లు సమాచారం. ఈ రకంగా ప్రతి రోజు తెచ్చే ఒక్కో సర్కిల్‌లో 30 కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ పూర్తయిన కుక్కలను గుర్తుపట్టేందుకు చెవిని కట్ చేస్తారు. కానీ పలు సర్కిళ్లలో చెవి కట్ చేసిన కుక్కలను కూడా మళ్లీ షల్టర్‌కు తీసుకువచ్చి, మరోసారి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసినట్లు రికార్డుల్లోకి ఎక్కిస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఈ వ్యవహారం ఇటీవలే బయటపడటంతో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా, రికార్డులో మార్పులు చేర్పులు ఆగడం లేదని తెలిసింది. కుక్కల మాట అలా ఉంచితే శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గెదెలు, మేకలను సైతం పట్టుకొస్తున్నారు. వీటిని క్లెయిమ్ చేసేందుకు యజమానులు వచ్చే ముందే వాటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. పందులను సైతం పలు మటన్, చికెన్ షాపుల యజమానలకు అమ్ముకుంటున్నట్లు, ఇందుకు ప్రత్యేకంగా బృందాన్ని నియమించుకున్నట్లు సమాచారం.