హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రతీకార హత్యగా పోలీసుల వెల్లడి..
ఫలక్ నుమా పోలీసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హత్య కేసును ఛేదించి నలుగురి నిందితులను అరెస్టు చేశారు.
దిశ, బహదూర్ పురా: ఫలక్ నుమా పోలీసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హత్య కేసును ఛేదించి నలుగురి నిందితులను అరెస్టు చేశారు. ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలా పత్తర్, ఖాజా నగర్ లో నివాసముండే మహమ్మద్ ఆయాజ్ (28), సంజయ్ గాంధీనగర్ లోని పౌల్ట్రీ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 వ తేదీన సంజయ్ గాంధీనగర్ లోని మెజెస్టీ హెయిర్ సెలూన్ వద్ద నలుగురు నిందితులు అయాజ్ ను హత్య చేశారు. ఈ హత్యా నేరంలో ఏ 1మహమ్మద్ ఆసిఫ్ (22), ఏ 2 షేక్ ఖలేద్ (26), ఏ 3 గా మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ (21), ఏ 4 మహమ్మద్ నదీమ్ ఖురేషి (24), ఏ 5 గా షకీరా బేగం ఉన్నారు. హత్యగావించ బడిన మహమ్మద్ అయాజ్ మరో ఇద్దరితో కలిసి 2015 లో మహమ్మద్ అలీ అనే వ్యక్తిని హత్య చేశారు. మహమ్మద్ అలీ ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆసిఫ్ కు మామ అవుతాడు.
ప్రతీకారంతో రగిలిపోతున్న ఆసిఫ్, మహమ్మద్ ఆయాజ్ ఇంటివద్దె గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆసిఫ్ తల్లి షకీరా బేగంతో ఆయాజ్ కు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో అయాజ్ ఆసిఫ్ ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే షకీరా బేగం ఆసిఫ్ ను మహమ్మద్ ఆయాజ్ ను హత్య చేయడానికి ప్రేరేపించింది. పని ముగించుకొని వస్తున్న మహమ్మద్ అయాజ్ ను మెజెస్టి హెయిర్ సెలూన్ వద్దకు రాగానే పథకం ప్రకారం ఈ నెల 6వ తేదీన నలుగురు నిందితులు హత్య చేశారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితులను ఈ నెల 13వ తేదీన సంజయ్ గాంధీనగర్ స్మశాన వాటికలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీరా బేగం పరారీలో ఉంది. వీరి వద్ద నుంచి పారిపోవడానికి ఉపయోగించిన బజాజ్ పల్సర్ వాహనాన్ని మూడు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడ్డ నలుగురు నిందితులపై కాల పత్తర్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి.