సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి : కోదండరాం

ప్రజా వీరుడు పండుగ సాయన్న సమాజానికి చేసిన అమూల్యమైన సేవలను గుర్తించి, ఆయన జయంతి,

Update: 2025-01-05 11:46 GMT

దిశ, హిమాయత్ నగర్ : ప్రజా వీరుడు పండుగ సాయన్న సమాజానికి చేసిన అమూల్యమైన సేవలను గుర్తించి, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్చించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పండుగ సాయన్న రాష్ట్ర స్థాయి సేవా పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, టీజేఎస్ ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ.. పండుగ సాయన్న యావత్ తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

అలాగే, పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న సామాజిక వేత్తలు, జర్నలిస్టులు, మహిళా నాయకులు, కళాకారులు, కవులకు పండుగ సాయన్న రాష్ట్ర స్థాయి సేవా పురస్కారాలు ప్రదానం అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర శేఖర్ ముదిరాజ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్న రాములు, ఉమ్మడి కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య, నిర్వాహకులు శివ ముదిరాజ్, బ్రహ్మ, ఉదయ్, నీలం సైదులు, సాయి కిరణ్, మహేష్, ఆశాప్రియ తదితరులు పాల్గొన్నారు.


Similar News